
శ్రీశైల దేవస్థానం: మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీ నుండి నిర్వహిస్తున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో శుక్రవారం ముగిశాయి. . ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా ఈ రోజు ఉదయం శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
అశ్వవాహనసేవ:
వాహనసేవలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ జరిపారు.
ఈ సేవలో శ్రీస్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబుచేయించి ప్రత్యేక పూజాదికాలు చేశారు. తరువాత ఆలయప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిపారు.
పుష్పోత్సవం – శయనోత్సవం:
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద శ్రీ స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం జరిపారు.
ఈ పుష్పోత్సవంలో శ్రీస్వామిఅమ్మవార్లకు కాగడాలు, ఎర్రగులాబీలు, తెల్లగులాబీలు, పసుపు గులాబీలు, ఎర్రమందారం, తెల్లమందారం, ముద్దమందారం, నందివర్ధనం, గరుడవర్ధనం, కనకాంబరాలు, సుగంధాలు (లిల్లీపూలు), పసుపుచేమంతి, ఊదాచేమంతి, తెల్లచేమంతి, ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు, దేవగన్నేరు, ముద్దగన్నేరు, మొదలైన 20 రకాలకు పైగా పుష్పాలు, బిల్వం, మరువం మొదలైన పలు రకాల పత్రాలతో స్వామిఅమ్మవార్లను విశేషంగా అర్చించారు.
అదేవిధంగా అరటి, తెల్లద్రాక్ష, నల్లద్రాక్ష, దానిమ్మ, బత్తాయి, కమల, జామ, ఖర్జూరం, యాపిల్, ఫైనాపిల్, మొదలైన 11 రకాల ఫలాలు కూడా నివేదించారు.
తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి శయనోత్సవంజరిగింది. కాగా ఈ శయనోత్సవానికిగాను ఆలయప్రాంగణములోని స్వామివార్లశయన మందిరానికి విశేష పుష్పాలంకరణ చేశారు.