వీరశిరోమండపంలో అఖండ భజనలు ప్రారంభం

 శ్రీశైల దేవస్థానం:పవిత్ర శ్రావణమాసంలో శివస్మరణ అత్యంత విశిష్టమైనది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లోక కల్యాణం కోసం ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో దేవస్థానం శివచతుస్సప్తాహ భజనలు నిర్వహిస్తోంది. అంటే నెల పూర్తిగా రేయింబవళ్లు నిరంతరంగా ఈ భజన సాగుతుంది. ఈ పవిత్ర అఖండ భజనలు శ్రావణమాస ప్రారంభం సందర్భంగా ఆలయప్రాంగణంలోని వీరశిరోమండపంలో ఈ రోజు (09.08.2021)న  ప్రారంభమయ్యా యి భాద్రపద శుక్ల పాడ్యమి 08.09.2021)న ముగుస్తాయి.

ఈ భజన ప్రారంభంలో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం భజన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను జరిపారు. ఆ తరువాత  స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలు జరిగాయి. ఈ పూజల అనంతరం పంచాక్షరీనామ భజనను  ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యలలో భాగంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భజనలో పాల్గొనే అవకాశం కల్పించామన్నారు.

 కోవిడ్ నెగిటీవ్ సర్టిఫికెట్ కలిగియున్నవారిని మాత్రమే భజన కార్యక్రమానికి అనుమతించేలా చర్యలు తీసుకున్నామని , ఒక్కొక్క బృందం లో  పరిమిత సంఖ్యలో మాత్రమే భజన భక్తులను అనుమతించేలా చూసామని పేర్కొన్నారు.

 కర్నూలు నగరానికి చెందిన నాలుగు భజన బృందాలకు,  కర్ణాటకకు చెందిన రెండు భజన బృందాలకు ఈ శ్రావణమాస శివభజనలు చేయడానికి అవకాశం కల్పించారు. శ్రీ సుంకులమ్మదేవి భజన మండలి వారు (09.08.2021 నుండి 16.08.2021 వరకు), శ్రీ రామాంజనేయ భజనమండలివారు (14.08.2021 నుండి 21.08.2021 వరకు), శ్రీ చెన్నకేశవ నాటక కళా భజన మండలి రెండు బృందాల వారు (21.08.2021 నుండి 28.09.2021 వరకు), శ్రీ గురునిమిషాంబదేవి భజన మండలి కర్నూలు వారు (28.08.2021 నుండి 03.09.2021), మల్లికార్జున భజన సంఘం, సుమ్కేశ్వారాహాల్,రాయచూరు జిల్లా మరియు ప్రభులింగ సేవా సంఘం గోపన దేవర హళ్లి, కర్ణాటక రాష్ట్రం వారు ( 01.09.2021 నుండి 08.09.2021 ) పాల్గొంటున్నారు.

కలియుగంలో కేవలం స్మరణతోనే ముక్తి సాధ్యమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. నవవిధ భక్తులలో భగవంతుని లీలావిశేషాలను వినడం, ఉచ్చరించడం, తలచడం, భగవంతుని పాదములను సేవించడం, భగవంతుని అర్చించడం, ఆయనకు వందనములు సమర్పించడం, భగవంతునిపట్ల దాస్యభావంతో ఉండడం, భగవంతుని పట్ల సఖ్యభావంతో ఉండటం, చివరికి భగవంతునికి  ఆత్మసమర్పణ చేయడం అనేవి ముఖ్యమైనవి. వీటిలో నామస్మరణ చాలా ప్రాముఖ్యమైంది. ఆలయములలో అటువంటి స్మరణ పూర్వకమైన భజనలను ఏర్పాటు చేయడం వలన భక్తులలో ఆధ్యాత్మికత పెరిగి భక్తులు అలౌకికానందానికి లోనవుతారని, ఆలయ సంప్రదాయానికి మూలమైన ఆగమాలు చెబుతున్నాయి.

print

Post Comment

You May Have Missed