శ్రావణమాసం సందర్భంగా శ్రీశైల దేవస్థానంలో శివచతుస్సప్తాహ భజనలు
శ్రీశైల దేవస్థానం:పవిత్ర శ్రావణమాసంలో శివస్మరణ అత్యంత విశిష్టమైనది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లోక కల్యాణం కోసం ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో శ్రీశైల దేవస్థానం శివచతుస్సప్తాహ భజనలు నిర్వహిస్తోంది. అంటే నెల పూర్తిగా రేయింబవళ్లు నిరంతరంగా ఈ భజన సాగుతుంది. ఈ పవిత్ర అఖండ భజనలు శ్రావణ శుద్ధ పాడ్యమి (సోమవారం 09.08.2021 నుండి ప్రారంభమై భాద్రపద శుక్ల పాడ్యమి 08.09.2021)న ముగుస్తాయి.
కాగా కోవిడ్ నియంత్రణ చర్యలలో భాగంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భజనలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
కోవిడ్ నెగిటీవ్ సర్టిఫికెట్ కలిగియున్నవారిని మాత్రమే భజన కార్యక్రమానికి అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్క బృందంలో పరిమిత సంఖ్యలో మాత్రమే భజన భక్తులను అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు.
కర్నూలు నగరానికి చెందిన నాలుగు భజన బృందాలకు, కర్ణాటకకు చెందిన రెండు భజన బృందాలకు ఈ శ్రావణమాస శివభజనలు చేయడానికి అవకాశం కల్పించారు .. శ్రీ సుంకులమ్మదేవి భజన మండలి (09.08.2021 నుండి 16.08.2021 వరకు), శ్రీ రామాంజనేయ భజనమండలి (14.08.2021 నుండి 21.08.2021 వరకు), శ్రీ చెన్నకేశవ నాటక కళా భజన మండలి రెండు బృందాలు (21.08.2021 నుండి 28.09.2021 వరకు), శ్రీ గురునిమిషాంబదేవి భజన మండలి కర్నూలు (28.08.2021 నుండి 03.09.2021), మల్లికార్జున భజన సంఘం, సుమ్కేశ్వారాహాల్,రాయచూరు జిల్లా, ప్రభులింగ సేవా సంఘం గోపన దేవర హళ్లి, కర్ణాటక రాష్ట్రం (01.09.2021 నుండి 08.09.2021 ) ఈ కార్యక్రమం చేపడుతాయి.
కలియుగంలో కేవలం స్మరణతోనే ముక్తి సాధ్యమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. నవవిధ భక్తులలో భగవంతుని లీలావిశేషాలను వినడం, ఉచ్చరించడం, తలచడం, భగవంతుని పాదములను సేవించడం, భగవంతుని అర్చించడం, ఆయనకు వందనములు సమర్పించడం, భగవంతునిపట్ల దాస్యభావంతో ఉండడం, భగవంతుని పట్ల సఖ్యభావంతో ఉండటం, చివరికి భగవంతునికి ఆత్మసమర్పణ చేయడం అనేవి ముఖ్యమైనవి. వీటిలో నామస్మరణ చాలా ప్రాముఖ్యమైంది. ఆలయములలో అటువంటి స్మరణ పూర్వకమైన భజనలను ఏర్పాటు చేయడం వలన భక్తులలో ఆధ్యాత్మికత పెరిగి భక్తులు అలౌకికానందానికి లోనవుతారని, ఆలయ సంప్రదాయానికి మూలమైన ఆగమాలు చెబుతున్నాయి.
లోక కల్యాణం కోసం సుమారు 49 సంవత్సరాలుగా ప్రతీ శ్రావణమాసంలో దేవస్థానం ఈ అఖండ శివభజనలు జరిపిస్తోంది.
Post Comment