శ్రీశైల దేవస్థానం: భక్తుల సంతృప్తి మేరకు అభివృద్ధి కార్యక్రమాలు వుంటాయని ధర్మకర్తల మండలి నిర్ణయించింది
దేవస్థానం ధర్మకర్తల మండలి 6వ సమావేశం మంగళవారం నిర్వహించారు. కార్యాలయ భవనములోని మీటింగ్ హాల్లో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, సభ్యులు బోడేపూడి వెంకటసుబ్బారావు, శ్రీమతి జవ్వాజి రేఖాగౌడ్, వీడియోకాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, తక్కిన పలువురు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ప్రత్యక్షంగా సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో మొత్తం 22 అజెండా అంశాలు చర్చించారు. వీటిలో 15 అంశాలు ఆమోదించారు. తక్కిన వాటిలో 5 అంశాలు వాయిదా వేసారు. మిగిలిన 2 అంశాలను తిరస్కరించారు.
సమావేశం ప్రారంభంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. అదేవిధంగా క్షేత్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా భక్తుల రద్దీకనుగుణంగా ఆయా ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు. భక్తుల నుంచి పూర్తిస్థాయి సంతృప్తి వచ్చేవిధంగా ఆయా ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు.
• క్షేత్ర పరిధిలో భక్తులరద్దీకనుగుణంగా గుర్తించిన మొత్తం 20 ప్రదేశాలలో బి.ఓ.టి పద్దతిన అన్ని సౌకర్యాలతో శాశ్వత శౌచాలయాల ప్రాంగణాలను ( పర్మనెంట్ పబ్లిక్ టాయిలెట్స్) నిర్మించాలని తీర్మానించారు. రాబోవు 6 మాసాలలోగా ఈ పని పూర్తి చేయాలని నిర్ణయించారు.
• టోల్గేట్ సమీపం నుంచి కుమార సదనం వరకు రూ. 24లక్షల వ్యయంతో సి.సి రోడ్డు నిర్మించాలని తీర్మానించారు.
• వర్కుషాపు నుంచి పాతాళగంగ పాతమెట్ల వరకు రూ. 36,50,000 లక్షల అంచనా వ్యయంతో అండరు గ్రౌండ్ డ్రైనేజీ బైపాస్ పనులకు తీర్మానించారు.
• దేవస్థానం గో సంరక్షణశాలలో గోవులకు అవరమైన వరిగడ్డి , పచ్చిగడ్డి సరఫరాకు సంబంధించిన టెండరును ఆమోదించారు.
• సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్సు లో బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నూతన శాఖను ఏర్పాటు చేసుకోటానికి ఆమోదించారు.
సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తులరద్దీకనుగుణంగా క్యూకాంప్లెక్సునిర్మాణాన్ని త్వరలో చేపట్టాలని నిర్ణయించారు.
సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు క్షేత్ర పరిధిలో పలుచోట్ల ఉన్న ప్రస్తుత డార్మిటరీలను ఆధునీకరించడంతో పాటు నూతనంగా మరిన్ని డార్మిటరీలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాబోవు వర్షాకాలంలో క్షేత్ర పరిధిలో పలుచోట్ల కనీసం ఆరువేల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు.
