శ్రీశైల దేవస్థానం:ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు.
వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు.అనంతరం స్వర్ణ రథోత్సవం జరిగింది.
స్వర్ణ రథోత్సవంలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిపారు ఉదయం గం.7.30లకు ఈ స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు తిరిగి అక్కడి నుండి నంది మండపం వరకు రథోత్సవాన్ని జరిపారు.
సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, డోలు వాయిద్యం మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు.
అదేవిధంగా రథోత్సవంలో నామసంకీర్తన (భజన), గిరిజన చెంచు నృత్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.
స్వర్ణ రథోత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ ఈ. చంద్రశేఖరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, అర్చకస్వాములు, వేద పండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, తదితర సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.