శ్రీశైల దేవస్థానం:
దేవస్థానంలోని విభాగాలు భక్తుల సౌకర్యాల కల్పననే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుండాలని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు సాయంకాలం పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో కార్యనిర్వహణాధికారి భక్తుల సదుపాయల కల్పనపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శాఖల అధిపతులు, విభాగాల పర్యవేక్షకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ విభాగాల వారు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ఎప్పటికప్పడు సౌకర్యాలను మెరుగు పరుస్తుండాలన్నారు. దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం, అన్నప్రసాద వితరణ, ఉచిత ప్రసాద వితరణ, శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ లాంటి మౌలిక వసతులపై భక్తుల నుంచి 90 శాతం సానుకూల స్పందన ఉండాలన్నారు. అందుకనుగుణంగా ప్రతీ ఉద్యోగి కూడా తమ విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితులలో కూడా విధులలో అలసత్వం ఉండకూడదన్నారు.
న్నారు.
న్నారు.పెరుగుతున్న ఎండ తీవ్రత కారణంగా భక్తులకు మంచినీటిని కల్పించేందుకు క్షేత్ర పరిధిలోని ప్రధాన కూడళ్ళలో ఇప్పటికే ఉచిత చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ చలి వేంద్రాలలో మంచినీటితో పాటు మజ్జిగ కూడా అందజేయడం జరుగుతుందన్నారు. వేసవికాలం ముగిసేంతవరకు కూడా ఈ చలివేంద్రాలను కొనసాగిస్తుండాలన్నారు.
క్యూలైన్లలోనూ, క్యూకాంప్లెక్సులలోనూ, ఆలయప్రాంగణంలోనూ నిరంతరం మంచినీటి సరఫరా ఉండాలన్నారు. ఆలయ ప్రాంగణంలో ఇప్పటికే మట్టికుండలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆలయప్రాంగణంలో మరిన్ని కుండలను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
క్యూకాంప్లెక్సులో నిరంతరం భక్తులకు అల్పాహారాన్ని అందజేస్తుండాలన్నారు. అన్నప్రసాద వితరణ భవనంలో శుచీ శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధవహించాలన్నారు. అన్నప్రసాద వితరణలోని రోజువారి వంటకాలలో తాజా కూరగాయలను మాత్రమే వాడాలన్నారు. కూరగాయలను కూడా తగువిధంగా తరగడం ఎంతైనా అవసరమన్నారు. సంబంధిత అధికారులు కూరగాయలు తరగడాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తుండాలన్నారు. ముఖ్యంగా అన్నప్రసాదాలు రుచికరంగా ఉండేవిధంగా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలన్నారు. భక్తులు అధిక సమయం వేచివుండకుండా త్వరితగతిన అన్నప్రసాదాలను అందజేస్తుండాలన్నారు.
వడ్డన సమయంలో ఆత్మీయంగా వంటకాలను వడ్డిస్తుండాలన్నారు. ప్రతీహాలులో కూడా వడ్డన సజావుగా జరిగేటట్లు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. ప్రతీ హాలును కూడా సిబ్బంది ప్రత్యేకంగా నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. సంబంధిత పర్యవేక్షణ చేసే సిబ్బంది క్షేత్రపరిధిలోని ప్రతీ వీధిలో కూడా నిరంతరం పారిశుద్ధ్య పర్యవేక్షణను చేస్తుండాలన్నారు. చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలన్నారు.
దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా తగు సమయాలలో ప్రసారం చేస్తుండాలన్నారు. భక్తులు ఆయా సదుపాయాలను వినియోగించుకునే వీలు కలుగుతుందన్నారు.
