శ్రీశైల దేవస్థానం:
దేవస్థానం లో నలుగురు ఉద్యోగులు వయస్సు రీత్యా నిన్న 31 న ఉద్యోగ విరమణ చేశారు. ఈ రోజు స్థానిక మల్లికార్జున కల్యాణ మండపంలో వీరికి ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు.
డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు యం. నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి యం.హరిదాసు, పంపు ఆపరేటర్ వి. ఓబులేశుడు నిన్న ఉద్యోగ విరమణ చేసినవారిలో ఉన్నారు.
కాగా ఈ ఆత్మీయ సభకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.
ఆత్మీయ సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, శ్రీమతి జి. లక్ష్మేశ్వరి, శ్రీమతి కోడె కాంతివర్ధిని, శ్రీమతి జవ్వాజి రేఖాగౌడ్, ఆలా అనిల్‌కుమార్, మేడా మురళీధర్, శ్రీమతి ఉప్పుటూరి సుబ్బలక్ష్మి, శ్రీమతి పి. యు. శివమ్మ, ప్రత్యేక ఆహ్వానితులు కారుపర్తి నాగమల్లేశ్వరరావు,వేమిరెడ్డి కోటారెడ్డి, బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి, కె. నాగమల్లేశ్వరరావు, వి. కోటారెడ్డి, బి. చంద్రమౌళీశ్వరరెడ్డి, ఎ. శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి వేదస్వస్తితో కార్యక్రమం ప్రారంభించి తరువాత సభకు అధ్యక్షతన వహించిన కార్యనిర్వహణాధికారి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవస్థానంలో పనిచేసే సిబ్బంది అటు భగవంతుడుని, ఇటు భక్తులను సేవించుకునే అవకాశం లభిస్తుందన్నారు. దేవస్థానంలో విధులు నిర్వహించి, నిన్నటిరోజున పదవీవిరమణ చేసిన ఉద్యోగులందరు ఎంతో అంకిత భావంతో విధులు నిర్వర్తించారన్నారు.
తరువాత పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు మాట్లాడుతూ ఉద్యోగులు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యం వలన మాత్రమే దేవస్థానంలో ఉద్యోగ భాద్యతలు నిర్వహించే అవకాశం లభిస్తుందన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులందరు కూడా పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరు ఎంతో నిబద్దతతో విధులు నిర్వహించారన్నారు.
నిన్న పదవీ విరమణ చేసిన డిప్యూటీ కమిషనరు డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్. రమణమ్మ దాదాపు 39 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించారు. అదేవిధంగా ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరుగా యం నరసింహారెడ్డి 36 సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. సహాయ కార్యనిర్వహణాధికారిగా ఉద్యోగ విరమణ చేసిన యం. హరిదాసు 36 సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. పంపు ఆపరేటరుగా పదవీ విరమణ చేసిన బి. ఓబులేశుడు 22 సంవత్సరాలకు పైగా విధులు నిర్వర్తించారు.
కార్యక్రమ చివరలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు , జ్ఞాపికతో దేవస్థానం సత్కరించింది . అదేవిధంగా ధర్మకర్తల మండలి సభ్యులు కూడా పదవీ విరమణచేసిన ఉద్యోగులను సత్కరించారు. దేవస్థాన ఉద్యోగుల సంక్షేమ సంఘం తరుపున సంఘ కార్యదర్శి పి.వి.సుబ్బారెడ్డి పదవీ విరమణ చేసిన ఉద్యోగులను సత్కరించారు. పలువురు దేవస్థానం సిబ్బంది కూడా పదవీ విరమణ చేసిన ఉద్యోగులను సత్కరించారు.
