శ్రీశైల దేవస్థానం:
హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఈ రోజు మంగళవారం శ్రీ భక్తాంజనేయస్వామి వారికి విశేషపూజలు నిర్వహించారు.
శ్రీశైలంలోని పాతాళగంగ మార్గంలో శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరిపించారు.
లోక కల్యాణం కోసం జరిపిన ఈ విశేష పూజలలో భాగంగా, ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలలో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని అర్చకులు సంకల్పాన్ని చెప్పారు.
తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపించారు.
అనంతరం భక్తాంజనేయస్వామి వారికి ఆయా సూక్తాలతో పంచామృతాభిషేకం, జలాభిషేకం జరిపించారు.
తరువాత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తరపూజ, నాగవల్లిదళపూజ (ఆకుపూజ), వడమాల సమర్పణ, పుష్పార్చన జరిపించారు.
ఈ కార్యక్రమం లో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
