శ్రీశైల దేవస్థానం:
•
• ఉదయం శోభాయమానంగా జరిగిన కలశయాత్ర
• కలశయాత్రలో పాల్గొన్న సుమారు 1000 మంది భక్తులు
• శివపంచాక్షరీ నామలేఖన యజ్ఞం
• ఎల్.ఈ.డి స్క్రీన్‌పై జాతీయ ప్రసారం
• సాయంత్రం ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు
దేవస్థానంలో ఈ రోజు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు,ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు కారుపర్తి నాగమల్లేశ్వరరావు, ఆకుల శ్రీనివాసులు, అర్చక స్వాములు, వేదపండితులు, పలువురు దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్యక్రమములో భాగంగా ఈ ఉదయం ఆలయ ప్రాంగణములోని అక్కమహాదేవి అలంకార మండపంలో సహస్ర కలశరాధన కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా లోకకల్యాణాన్నికాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపించారు. తరువాత సహస్ర కలశారాధన కార్యక్రమం జరిగింది. గంగానది పుణ్య నదీ జలాలను కలశంలోకి ఆహ్వానిస్తూ కలశారాధన నిర్వహించారు. కలశారాధన తరువాత పుణ్యజల కలశాలను భక్తులకు అందజేసారు.
భక్తులందరు కూడా భక్తిశ్రద్ధలతో కలశాలను తలపై ధరించి కలశ యాత్రలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం నుంచి గంగాధర మండపం వరకు, అక్కడి నుంచి నందిగుడి వరకు, నందిగుడి నుంచి మల్లికార్జునసదన్ మీదుగా క్షేత్రపాలకుడైన బయలువీరభద్రస్వామి ఆలయం వరకు ఈ కలశయాత్ర కొనసాగింది.
ఈ సందర్భంగా బయలువీరభద్రస్వామివారికి విశేష పూజాదికాలు జరిపించారు. అనంతరం బయలువీరభద్రస్వామి ఆలయం నుంచి గంగాధర మండపం మీదుగా ఆలయప్రాంగణం వరకు కలశయాత్ర కొనసాగించారు. కలశయాత్ర అనంతరం శ్రీవృద్ధమల్లికార్జునస్వామివారికి శాస్త్రోక్తంగా కలశాభిషేకం జరిపించారు .
ఈ కలశయాత్రలో సుమారు 1000 మంది భక్తులు పాల్గొన్నారు. కలశ యాత్రలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీస్వామి వారి అలంకార దర్శనం, అమ్మవార్ల దర్శనం కల్పించారు.
శివపంచాక్షరీ నామలేఖన యజ్ఞం :
కలశయాత్ర తరువాత శివపంచాక్షరీ నామలేఖన యజ్ఞ కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భక్తులందరు కూడా శివపంచాక్షరీ నామాన్ని లిఖించేందుకు ( వ్రాసేందుకు) వీలుగా శివ పంచాక్షరీ పుస్తకాలను, కలములు ( పెన్నులు) దేవస్థానం భక్తులకు అందజేసింది. అనంతరం భక్తులందరు కూడా శివపంచాక్షరీ మంత్రాన్ని రాశారు. ఈ శివపంచాక్షరి పుస్తకాలను శ్రీస్వామి అమ్మవార్లకు సమర్పించడం ప్రత్యేకం.
ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు :
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగానే ఈ సాయంకాలం గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేయబడిన ప్రత్యేక వేదిక వద్ద పలు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ముందుగా ఈ సాయంత్రం గం. 5.30లకు శ్రీ సత్యంస్వామి , వారి బృందం, వనపర్తి వారిచే శివభజనలు నిర్వహించారు. తరువాత గం. 6.30లకు తాతా సందీప్‌శర్మ, రాజమహేంద్రవరం వారు ఓంకార ప్రాశస్త్యంపై ప్రవచనం ఏర్పాటు చేశారు. అనంతరం రాత్రి గం. 7.30ల నుంచి సుప్రియ బృందం, విజయనగరం వారిచే పేరిణి శివతాండవం ప్రదర్శించారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సోమనాథ ఆలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు, ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాల సందర్భంగా భారత ప్రభుత్వ సాంస్కృతికశాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరున పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దేవదాయశాఖ ఉత్తర్వుల మేరకు ఈ రోజు ( 11.05.2026) దేవస్థానం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది, ధార్మిక చైతన్యానికి, సంప్రదాయ పరిరక్షణకు దేవాలయమే ఆలవాలమన్నారు. అందుకే సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యవస్థలో దేవాలయానికి ఎంతో ప్రత్యేకస్థానముందన్నారు. ధర్మం అనేది సమాజాన్ని సక్రమమార్గంలో నడిపిస్తుందన్నారు. ధర్మాచరణ వల్ల పటిష్టమైన సమాజం ఏర్పడుతుందన్నారు.
