శ్రీశైల దేవస్థానం:
ఈ రోజు పౌర్ణమి సందర్భంగా దేవస్థానం శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించింది.
ఈ రోజు సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహా మంగళహారతుల అనంతరం ఈ గిరిప్రదక్షిణ ప్రారంభమయింది.
ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం నుండి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారిపైకి చేరుకుంది. అక్కడి నుండి సారంగధర మఠం మీదుగా సాగి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంది. హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి మహిషాసురమర్ధిని, రుద్రాక్షమఠం, విభూతిమఠాల మీదుగా రుద్రవనంలోకి చేరుకుంది.
రుద్రవనం నుంచి నందిమండపం వద్దకు రావడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగిసింది.
*లక్ష కుంకుమార్చన
ఈ రోజు పౌర్ణమి సందర్భంగా శ్రీ అమ్మవారికి లక్షకుంకుమార్చన జరిపారు.
ఈ లక్షకుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవగా పాల్గొనే అవకాశం కూడా కల్పించారు.
పలువురు భక్తులు పరోక్షసేవగా ఈ కుంకుమార్చనను జరిపించుకున్నారు.
ఇందులో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ పూజలను నిర్వహించుకున్నారు.
లక్షకుంకుమార్చనలో ముందుగా పూజాసంకల్పం పఠించి తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను నిర్వహించారు. అనంతరం లక్షకుంకుమార్చన జరిపించారు.
మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఈ కుంకుమ ద్రవ్యముతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పండితులు పేర్కొంటున్నారు.
ఈ లక్షకుంకుమార్చన జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వ శుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, సంసారం వృద్ధిలోకి వస్తుందని, సంతాన సౌఖ్యం కలుగుతుందని, పూర్వ జన్మదోషాలు తొలగిపోతాయని నమ్మకం.
శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జితసేవలను పరోక్షంగా జరిపించుకునేందుకువీలుగా దేవస్థానం ఈ ఆర్జితపరోక్షసేవను నిర్వహిస్తోంది.
ఈ పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
భక్తులు సేవా రుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 లను సంప్రదించవచ్చును.
*సుమని సాయిరెడ్డి , హైదరాబాద్ ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,116/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాద్కు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
*జి.వెంకటేష్, రాయచూర్, కర్ణాటక ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,116 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
*యన్. సత్యనారాయణ, నంద్యాల ఈ రోజు (01.05.2026) అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,000/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
*
ఊయలసేవ
ఈ రోజు శుక్రవారం , పౌర్ణమి సందర్భంగా శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించారు.
ప్రతి శుక్రవారం , పౌర్ణమి, మూలానక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ నిర్వహిస్తారు.
లక్షకుంకుమార్చన తరువాత ఈ ఊయలసేవ జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్నికాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించారు.
అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపారు. చివరగా ఊయలసేవ నిర్వహించారు.
ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చన జరిపించారు.
పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించారు.
*వెంకటేష్, రాయచూర్, కర్ణాటక అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,01,000/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
*
సాంస్కృతిక కార్యక్రమాలు
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం ఈ రోజు శ్రీ విఘ్నేశ్వర కూచిపూడి నాట్యాలయము, ఒంగోలు వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమములో గణనాయక, మూషికవాహన, ఓం నమ:శివాయ, శివతాండవం తదితర గీతాలకు అనన్య,స్పందన, దీపిక, యామిని, దీక్షిత, హీరా మీనన్, స్నేహారెడ్డి తదితరులు నృత్యప్రదర్శన చేశారు.
–
* మల్లమ్మ జయంతి
శ్రీశైల మల్లికార్జునస్వామివారి పరమ భక్తులలో ఒకరైన హేమారెడ్డి మల్లమ్మ వారి జయంత్యోత్సవం వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని గోశాల సమీపంలో మల్లమ్మ మందిరంలో ( మల్లమ్మ ఆనందబాష్పాలు) ఈ రోజు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లమ్మవారికి పంచామృత అభిషేకం, జలాభిషేకం తదితర విశేషపూజలు జరిపారు.
ఈ విశేషకార్యక్రమంలో భాగంగా ముందుగా జయంత్యోత్సవ సంకల్పం పఠించి తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహా గణపతిపూజ జరిపారు.అనంతరం స్తోత్ర పారాయణలతో మల్లమ్మవారికి అభిషేకం, అర్చన జరిపించారు.
చివరగా మల్లమ్మను స్తుతిస్తూ పలు భక్తి గీతాలు ఆలపించారు.
విశేషపూజాదికాలలో ప్రధాన అర్చకులు వీరయ్య స్వామి, పర్యవేక్షకులు పలువురు అర్చక స్వాములు సిబ్బంది పాల్గొన్నారు.
