శ్రీశైల దేవస్థానం:
• సదుపాయాల కల్పనకు కార్యాచరణ ప్రణాళిక
• మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ
• ఎప్పటికప్పుడు సౌకర్యాల పర్యవేక్షణ
• భక్తుల సంతృప్తే ప్రధానధ్యేయం
– యం. శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి
క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి అన్ని విభాగాలు కూడా ప్రణాళికలను రూపొందించుకుని, తదనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.
ఈ రోజు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల కార్యాచరణకు సంబంధించి కార్యనిర్వహణాధికారి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ వసతి, ఆలయం, దర్శనాలు, అన్నప్రసాద వితరణ, ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం మొదలైన విభాగాలన్నీ కూడా తగు కాలపరిమితిని నిర్ధారించుకుని తదనుగుణంగా సౌకర్యాలను మెరుగుపర్చాలన్నారు.
పది రోజుల వ్యవధితో స్వల్పకాలిక ప్రణాళిక, 3 మాసాల వ్యవధితో మధ్యకాలిక ప్రణాళిక, ఒక సంవత్సర కాలపరిమితితో దీర్ఘకాలిక ప్రణాళికతో ఆయా విభాగాలు కార్యాచరణను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విభాగాల వారిగా చేపట్టవలసిన ఆయా పనుల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
దేవస్థానంలోని ప్రతీ ఉద్యోగి కూడా సౌకర్యాల కల్పనే ప్రధానలక్ష్యంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా విధులలో అలసత్వం ఉండకూడదన్నారు. విధుల నిర్వహణలో జవాబుదారితనం వుండాలన్నారు.
దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం,అన్నప్రసాదవితరణ, ఉచిత ప్రసాదవితరణ, శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక వసతులపై భక్తుల నుంచి 90శాతం సానుకూలత స్పందన ఉండాలన్నారు. అందుకనుగుణంగానే ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సి ఉందన్నారు.
ఆలయప్రాంగణంలో కూడా అవసరమైన చోట్ల చలువ పందిర్లు వేయాలన్నారు ఈ ఓ . ఆలయంలో అభిషేక పూజాసామాగ్రి కేంద్రం నుంచి కల్యాణమండపం మెట్ల వరకు ,మనోహరగుండం పైభాగంలో గల మూడు శివాలయాల ప్రదేశంలో చలువపందిర్లు ఉండాలన్నారు. భక్తులు వేచివుండేందుకు వీలుగా అవసరమైనచోట్ల గ్రీన్ మ్యాట్ ఏర్పాటు కూడా ఉండాలన్నారు.
సామూహిక అభిషేక సేవాకర్తల సౌకర్యం కోసమై ప్రధాన ధ్వజస్తంభం కుడివైపునుండి త్రిఫల వృక్షం, అమ్మవారి ఆలయం మెట్లమార్గం మీదుగా అక్కమహాదేవి అలంకార మండపం వరకు కూడా చలువ పందిర్లు ఉండాలన్నారు.
అమ్మవారి ఆలయం వెనుకభాగంనుంచి ఘంటామఠం వరకు, అదేవిధంగా అమ్మవారి ఆలయం వెనుకభాగం నుంచి ప్రసాదాల విక్రయకేంద్రం వరకు మరియు హరిహరరాయ గోపురం నుంచి ఉమారామలింగేశ్వరాలయం వరకు కూడా చలువపందిర్లు వేయాలన్నారు. అవసరమైనచోట్ల కొబ్బరిపీచు కార్పెట్లను కూడా వేయాలన్నారు.
క్యూ కాంప్లెక్సులోనూ, క్యూలైన్లలోనూ, ఆలయ ప్రాంగణంలోనూ నిరంతరం మంచినీటి సరఫరా ఉండాలన్నారు. అవసరమైనచోట్ల త్రాగునీటి కోసం మట్టికుండలను ఏర్పాటు చేయాలన్నారు.
పెరుగుతున్న ఎండతీవ్రత కారణంగా భక్తులకు మంచినీటిని కల్పించేందుకు క్షేత్రపరిధిలోని ప్రధాన కూడళ్ళలో ఉచిత చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
అన్నప్రసాదాలు రుచికరంగా ఉండేవిధంగా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. భక్తుల అధికసమయం వేచివుండకుండా త్వరితగతిన అన్నప్రసాదాల అందజేత ఉండాలన్నారు.
భక్తులసౌకర్యార్థం ఉదయం వేళలో క్యూకాంప్లెక్సునందు వేడిపాలను కూడా అందజేయాలన్నారు. అదేవిధంగా క్యూకాంప్లెక్సులో అల్పాహారాన్ని కూడా నిరంతరం అందజేస్తుండాలన్నారు.
దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాల పట్ల భక్తులకు అవగాహన కలిగేవిధంగా తగు ప్రచార బోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ మరియు శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.
పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. సంబంధిత పర్యవేక్షక సిబ్బంది క్షేత్రపరిధిలోని ప్రతి వీధిలో కూడా పారిశుద్ధ్య పర్యవేక్షణలను చేస్తుండాలన్నారు.
దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా ప్రసారం చేస్తుండాలన్నారు. దీని వలన భక్తులు ఆయా సదుపాయాలను వినియోగించుకునే వీలుకలుగుతుందన్నారు.
ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు, వివిధ విభాగాల పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
