శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం దేవస్థానం బుధవారం ఉదయం సాక్షిగణపతిస్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది.
కాగా ప్రతి బుధవారం, సంకట హరణ చవితి రోజులు , పౌర్ణమి రోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేషఅభిషేకం , పూజాదికాలు దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) నిర్వహిస్తున్నారు.
ఈ ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృతాలతోనూ, పలుఫలోదకాలతోనూ, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోదకం, శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారికి విశేషపుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపారు.
వైదిక సంప్రదాయాలలో గణపతి అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ గణపతి అభిషేకం వలన అనుకున్న పనులలో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని చెప్పబడుతోంది. కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయని, ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుందని నమ్మకం.
కాగా శ్రీశైలక్షేత్ర పరివార ఆలయాలలో సాక్షిగణపతి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లుగా కైలాసంలో పరమేశ్వరుని వద్ద ఈ స్వామి సాక్ష్యం చెబుతాడని ప్రసిద్ధి. అందుకే ఈ స్వామి సాక్షిగణపతిగా పేరొందాడు. చక్కని నల్లరాతితో మలచబడిన ఈ స్వామి ఒకచేతిలో కలం, మరోచేతిలో పుస్తకాన్ని ధరించి భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు.
