శ్రీశైల దేవస్థానం:దేవస్థానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు:
ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి, పలువురు శాఖాధిపతులు, విభాగాధిపతులు, సిబ్బంది, శివసేవకులు, ఎస్.పి.ఎఫ్ సిబ్బంది, హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవన ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతిపూజ జరిపించారు. తరువాత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల అర్పించారు.
అనంతరం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, హోంగార్డు సిబ్బంది, పతాక వందనం చేశారు. తరువాత ధర్మకర్తల మండలి అధ్యక్షులు జాతీయపతాకావిష్కరణ చేశారు. అనంతరం జాతీయగీతం ఆలపించారు.
తరువాత కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు జాతీయభావాలను జోడించి దేవస్థానంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. దేవస్థానం అభివృద్ధిలో ఉద్యోగులే ఎంతో కీలకపాత్రవహిస్తారన్నారు.
అందుకే ఈ సంవత్సరం అంకితభావంతో విశిష్ట సేవలు అందిస్తున్న కొందరు ఉద్యోగులకు ఉత్తమ ఉద్యోగి పురస్కారంతో సత్కరించడం జరిగిందన్నారు. పురస్కారం పొందిన వారికి ప్రశంసా పత్రం, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేయడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత జనవరి 26వ తేదీన నంద్యాలలో జరిగిన జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలలో దేవస్థానం ధర్మపథ శకటంతో దేవస్థానం శకటాన్ని ప్రదర్శించడం జరిగిందన్నారు. ఈ రోజు జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో కూడా దేవస్థానం ధర్మప్రచారంతో పాటు శకటాన్ని ప్రదర్శించడం ప్రత్యేకం.
అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ ఎందరో దేశభక్తుల, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మనం అనుభవిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలను వివరించారు. స్వాతంత్ర్యం సాధింపజేసిన మహనీయులను మనం స్మరించుకోవాలన్నారు.
ధర్మకర్తల మండలి అధ్యక్షులు గత సంవత్సరకాలంలో దేవస్థానం సాధించిన ప్రగతిని కూడా నివేదిక రూపంలో వివరించారు. క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకు అధికమవుతోందని, భక్తులరద్దీకనుగుణంగా ఆయా సౌకర్యాలు కల్పించాల్సి అవసరం ఉందన్నారు. భక్తులరద్దీకనుగుణంగా ఆయా సౌకర్యాల కల్పనకు దేవస్థానం తగు చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. క్షేత్రాభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. సిబ్బంది అందరు కూడా క్షేత్రాభివృద్ధిలో తమవంతు పాత్రను పోషించాలన్నారు.
కాగా కార్యక్రమంలో భాగంగా పతావిష్కరణ తరువాత కుమారి లిక్షితశ్రీ, లిక్షితాశ్రీ నృత్య కళాశాల, నందికొట్కూరు , వారి బృందంచే దేశభక్తి గేయాలకు సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు.
కార్యక్రమములో చివరగా పురస్కారానికి ఎంపికచేయబడిన దేవస్థానం ఉద్యోగులకు ఉత్తమ ఉద్యోగి పురస్కారాన్ని అందజేశారు. మొత్తం 66 మంది ఉద్యోగులకు పురస్కారాలు అందించారు . పలువురు శాశ్వత, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది ఈ పురస్కారాలు దినవారిలో ఉన్నారు.
ఆగమ పాఠశాలలో వంటశాల, భోజనశాల ప్రారంభం:
దేవస్థానం నిర్వహిస్తున్న ఆగమ పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటశాలను, భోజనశాలను ధర్మకర్తల మండలి అధ్యక్షులు ప్రారంభించారు.ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి, సంబంధిత దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం ఆగమపాఠశాలలో నూతనంగా వంటశాల, భోజనశాల నిర్మించడం జరిగిందన్నారు. అదేవిధంగా శౌచాలయ సముదాయాన్ని కూడా నిర్మింపజేయడం జరిగిందన్నారు. ఈ మొత్తం నిర్మాణాలకు రూ. 47 లక్షలు వ్యయం చేయడం జరిగిందన్నారు. విద్యార్థులందరు క్రమశిక్షణతో మెలుగుతూ ఆయా పాఠ్యాంశాలను శ్రద్ధగా అభ్యసిస్తుండాలని సూచించారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు భక్తిశ్రద్ధలతో ఆగమ విద్యను అభ్యసించాలని, సనాతన సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు.
