శ్రీశైల దేవస్థానం:
• ప్రణాళికాబద్దంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ
• యోగాంధ్ర కార్యక్రమములో అధికసంఖ్యలో స్థానికులు , యాత్రికులు పాల్గొనేలా చర్యలు
• రాబోవు వర్షాకాలంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు చర్యలు
• తిరుమల తరహాలో అమినిటీస్ కాంప్లెక్సు నిర్మాణానికి ప్రణాళికలు
• క్యూకాంప్లెక్సు నిర్మాణానికి వేగవంతంగా చర్యలు
దేవస్థానం ధర్మకర్తల మండలి 7వ సమావేశం ఈ రోజు నిర్వహించారు. కార్యాలయ భవనములోని సమావేశ మందిరంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.
కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, తక్కిన సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ప్రత్యక్షంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో మొత్తం 06 అజెండా అంశాలు చర్చించారు. వీటిలో 2 అంశాలు ఆమోదించారు. తక్కిన వాటిలో 2 అంశాలు వాయిదా వేసారు. మిగిలిన 2 అంశాలను తిరస్కరించారు. తదుపరి తక్కిన 21 అజెండా అంశాలను ఈనెల 11వ తేదీన ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.
సమావేశం ప్రారంభంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం ఆదేశించినట్లుగా దేవస్థానంలో ఈ నెల 11వ తేదీన ప్రత్యేకంగా యోగా కార్యక్రమాన్ని, ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ రెండు కార్యక్రమాలలో కూడా అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నారు. యాత్రికులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా ప్రచారాన్ని కల్పించాలన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా , క్షేత్ర సుందరీకరణను దృష్టిలో ఉంచుకుని రాబోవు వర్షాకాలంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. రాబోవు వర్షాకాలం ముగిసేలోగా క్షేత్ర పరిధిలో కనీసం 5 వేల నుంచి 6 వేల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు మాట్లాడుతూ నీడనిచ్చే మొక్కలతో పాటు దేవతా మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించడంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తరువాత ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. ఇందులో భాగంగా తిరుమల తరహాలో ఫిలిగ్రిమ్స్ అమినిటీస్ కాంప్లెక్సు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.
అదేవిధంగా క్యూకాంప్లెక్సు నిర్మాణానికి చేపట్టే చర్యలు కూడా వేగవంతం చేయాలన్నారు.
ఇంకా సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ పట్ల మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
కాగా సమావేశంలో శ్రీశైలక్షేత్ర దత్తత దేవాలయాలమైన జ్యోతిస్సిద్ధవటం దేవాలయం నందు విధులు నిర్వహించే సిబ్బందికి నెలవారిగా చెల్లించే పారితోషికాన్ని పెంపుదల చేయాలని తీర్మానించారు.
