హైదరాబాద్, ఫిబ్రవరి 3 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2026 -27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో రాష్ట్రానికి దక్కాల్సిన నిధులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సి.ఎస్ రామకృష్ణా రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రాయోజిత పధకాల నుండి అత్యధిక నిధులు పొందేలా ప్రణాళిక బద్దంగా పనిచేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సి.ఎస్.ఎస్ క్రింద ఐదు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్రతి పాదించిందని, దీనిలో భాగంగా 15 శాతం జనాభా ఉన్న తెలంగాణాకు కనీసం రూ. 25 వేలకోట్లు రావాల్సి ఉందని స్పష్టం చేసారు. ఈ కేంద్ర బడ్జెట్ లో ఫార్మా, రంగ అభివృద్ధి, సెమి కండక్టర్ తయారీ, వ్యవసాయ రంగంలో పలు అంశాల అభివృద్ధికి ప్రాధాన్యత నిచ్చారని, ఈదిశగా తగు చర్యలు తీసుకోవాలని సి.ఎస్ సూచించారు. ఖమ్మం, వరంగల్ కరీంనగర్ జిల్లాను కలుపుతూ టెంపుల్ కారిడార్ అభివృద్ధికి అవకాశం అందని, దీనిలో భాగంగా వరంగల్ లో మామునూరు ఎయిర్ పోర్ట్ కూడా వస్తున్నందున ఈ జిల్లాల్లో టూరిజం, పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్ధి కి గణనీయమైన అవకాశం ఉందని అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్రానికి మరో పది వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఈ విషయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. 16 ఆర్థిక కమిషన్ లో భాగంగా 2011 జనాభా ప్రాతిపదికపై నిధుల మంజూరు ఉంటుందని, దీనితో పాటు డెమోగ్రాఫిక్ ఏరియా, పధకాల అమలు సామర్ధ్యం, నిధుల వినియోగం లాంటి ప్రాతిపదికలపై కూడా నిధుల కేటాయింపు ఉంటుందని వివరించారు. ప్రధానంగా అభివృద్ధి ఆధారిత ఇండికేటర్ల ప్రాతిపదిక ప్రకారం నిధుల కేటాయింపుకు ప్రాధాన్య నిచ్చారని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సి.వీ. ఆనంద్, వికాస్ రాజ్, సంజయ్ కుమార్, జయేష్ రంజన్, సవ్య సాచి ఘోష్, అహ్మద్ నదీమ్, ముఖ్య కార్యదర్శులు సందీప్ సుల్తానియా, నవీన్ మిట్టల్, ఎన్. శ్రీధర్, కార్యదర్శులు పాల్గొన్నారు.
