దేవస్థానం:శ్రావణ మాసంలో మొదటి ఆదివారమైన ఈ రోజు 16 న భక్తులు వేకువజాము నుండే ఆలయాన్ని సందర్శిస్తున్నారు.దర్శనం ఏర్పాట్లు :
శ్రావణమాసంలో ప్రభుత్వ సెలవు దినాలు,శని ,ఆది,సోమవారాలలో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకుంటారు. భక్తులందరు సంతృప్తికరంగా శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేసారు.
వేకువజామున గం.3.00లకు ఆలయ ద్వారాలు తెరచి, ప్రాత:కాల పూజల అనంతరం వేకువజామున గం. 4.30ల నుంచి సాయంకాలం గం. 4.00ల వరకు దర్శనాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచే దర్శనాలు కొనసాగుతున్నాయి.
సామాన్య భక్తుల సౌకర్యార్థం శ్రావణ శనివారాలు, శ్రావణ ఆదివారాలు, శ్రావణ సోమవారాలు, వరలక్ష్మీ వ్రతం, శ్రావణపౌర్ణమి మొదలైన రోజులలో ( మొత్తం 19 రోజులపాటు) గర్భాలయ అభిషేకాలు , సామూహిక అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు పూర్తిగా నిలుపుదల చేసారు. అదేవిధంగా ఉదయాస్తమానసేవ, ప్రాత:కాల సేవ, ప్రదోషకాలసేవ పూర్తిగా నిలుపుదల చేసారు . ఈ రోజులలో రాత్రివేళలో మాత్రమే పరిమితంగా స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పిస్తారు.వేకువజాము నుంచి రాత్రివేళల వరకు అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు.
సిబ్బందికి ప్రత్యేక విధులు:
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకు దేవస్థానం శాఖాధిపతులకు, పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వర్తిస్తున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కార్యనిర్వహణాధికారి :
కాగా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఈ ఉదయం కార్యనిర్వహణాధికారి ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులతో నేరుగా మాట్లాడి ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
క్యూలైన్లలో అల్పాహారం :
క్యూకాంప్లెక్స్‌లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారం , మంచినీరు అందిస్తున్నారు. అదేవిధంగా ఈ ఉదయం వేళలలో వేడిపాలు, కూడా అందిస్తున్నారు.
అన్నప్రసాద వితరణ:
భక్తులకు అన్నదాన భవనములో ఉదయం 10.30 నుండి అన్నప్రసాదాల వితరణ చేస్తున్నారు. సాయంత్రం గం. 6.30ల నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.
లడ్డు ప్రసాదాలు:
శ్రావణ మాసంలో వచ్చే భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు.
