శ్రీశైల దేవస్థానం:
• శాస్త్రోక్తంగా పూర్ణాహుతి
• అయిదురోజులపాటు కొనసాగిన వరుణ యాగ సహితసహస్ర ఘటాభిషేకం
• లోకక్షేమం కోరి వేద పండితుల ఆశీర్వచనం
సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఈ నెల 7 నుండి 11 వరకు 5 రోజులపాటు వరుణయాగసహిత సహస్ర ఘటాభిషేక కార్యక్రమాలు అయిదవ రోజు అయిన ఈ రోజు పూర్ణాహుతితో ముగిశాయి.
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసారు.
కాగా అయిదురోజులపాటు జరిగిన ఈ కార్యక్రమములో ప్రతీరోజు ఋష్యశృంగ జపం, వారుణానుక పారాయణలు, వరుణజపం, భాగవత, విరాటపర్వ పారాయణలు, పంచాక్షరి జపం మొదలైనవి జరిపించారు. యాగశాల ప్రవేశం, శివసంకల్పం, ఋత్విగ్వరణం, కలశస్థాపనలు, రుద్రహోమం, హవనములు జరిపించారు.
ఏకాదశ రుద్ర ఋష్యశృంగ సహిత సహస్ర ఘటార్చన, మహాన్యాస పారాయణ, రుద్రపారాయణ, కాఠక శతానువాక పారాయణ, వేదపారాయణలు, వారుణానువాక సహిత ఋష్యశృంగ పారాయణ, రుద్రహోమం, చండీపారాయణ, శ్రీచక్రార్చాన, నవావరణార్చన విశేష కుంకుమార్చనలు నిర్వహించారు.
ఈ రోజు జరిగిన పూర్ణాహుతిలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు, ధర్మకర్తలమండలి సభ్యులు ఎ.వి. రమణ, జి. గంగమ్మ, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు ఆకుల శ్రీనివాసులు, అర్చకస్వాములు, వేదపండితులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
