శ్రీశైల దేవస్థానం: దేవస్థానంలో మంగళవారం వివిధ పూజ కార్యక్రమాలు జరిగాయి.
-
భజన కార్యక్రమం:దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) ఈరోజు అక్కిరాజు భజన బృందం, అంబేద్కర్ కోనసీమ వారు భజన కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమములో మహాగణపతి, మూషిక వాహన, మహాగణపతిం, శివశివ శంకరా, శంభో హరహర మహాదేవ, లింగాష్టకం, శ్రీశైలవాస, పార్వతి నాథుడా, శ్రీగిరి మల్లయ్య, పాతాళగంగమ్మ, కైలాసవాసమని మొదలైన పలు భక్తిగీతాలను, అష్టకాలను మొదలైన వాటిని శ్రీ అక్కిరాజు శ్రీనివాస కుమారు తదితరులు ఆలపించారు.కాగా శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
- విరాళం:
- పి.బాల సుబ్రహ్మణ్యం, నంద్యాల ఈ రోజు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,000/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివ ప్రసాద్ కు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
-
బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం:
-
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (24.03.2026) సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపించింది.ప్రతీ మంగళవారం , అమావాస్య రోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహిస్తున్నారు.బయలువీరభద్రస్వామివారు శివభక్త గణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్ర పాలకుడుగా క్షేత్రానికి ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్ఛాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట మకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రిందివైపున కుడివైపు దక్షుడు, ఎడమవైపు భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి.ముఖ్యంగా ఆగమసంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేషస్థానం ఉంది. క్షేత్ర పాలకుడికి పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయం,బాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు.
-
మంగళవారం, ఆదివారం , అమావాస్య రోజులలో చేసే వీరభద్రపూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్వామిపూజతో సకలగ్రహ అరిష్టదోషాలు, దుష్టగ్రహపీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభఫలితాలు చేకూరుతాయి.ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
నందీశ్వరస్వామికి విశేషపూజ:
లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించింది.
ప్రతి మంగళవారం , త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయం సంధ్యాసమయంలో ఈ విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పారు.
అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకుమహాగణపతిపూజ చేశారు.
ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం జరిపారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.
వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేయడం జరుగుతుంది. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను చేశారు. అనంతరం నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు.
చివరగా స్వామికి నివేదన సమర్పించారు.
*
అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ:
చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 7న ఈ కుంభోత్సవం నిర్వహిస్తారు.
అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు ( కొబ్బరికాయలు,గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.
కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం , శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతోంది.
ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు,కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపించారు. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు.
