ఉగాది మహోత్సవాలు రెండవ రోజైన మంగళవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక్య పూజలు జరిపారు. ఆ తరువాత ఉదయం గం. 8.00 నుండి స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, లోక కల్యాణం కోసం జపానుష్ఠానాలు రుద్రహోమం నిర్వహించారు.
అమ్మవారి యాగశాలలో చండీహోమం జరిపారు.
ఉత్సవములో భాగంగా అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు చేసారు.
కాగా సాయంత్రం 5.30 గంటలకు సాయంకాల పూజలు,జపానుష్ఠానములు జరిపారు.
కైలాసవాహనసేవ:
ఈ ఉత్సవాలలో భాగంగానే ఈ సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు కైలాస వాహన సేవ జరిపారు. ఈ సేవలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను కైలాస వాహనసేవపై వేంచేబు చేయించి విశేష పూజాదికాలు జరిపారు. తరువాత గ్రామోత్సవం నిర్వహించారు.కైలాస వాహనంపై అధిరోహించిన స్వామిఅమ్మవార్లను దర్శించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం.
మహాదుర్గ అలంకారం:
ఉత్సవాలలో భాగంగా ఈ రోజు అమ్మవారి ఉత్సవ మూర్తికి మహాదుర్గ అలంకారం, గ్రామోత్సవం జరిగాయి. అష్టభుజాలు గల ఈ దేవి శంఖం,చక్రం, గద, పద్మం, త్రిశూలం, ఖడ్గం మొదలైన వాటిని ధరించి దర్శనం ఇచ్చారు.
అదే విధంగా గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, రాజభటులవేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ డోల్ థేష్, విళక్కు, స్వాగత నృత్యం, వీరభద్రడోలు కుణిత, జాంజ్ పథక్ ( కర్ణాటక డోలు) కాళికా నృత్యం, జానపద పగటి వేషాలు, నందికోలు సేవ, గొరవనృత్యం, తప్పెటచిందు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లనగ్రోవి, డోలు విన్యాసం తదితర కళారూపాలను ఏర్పాటు చేశారు.
•
• మహోత్సవాలలో అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్న కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు
• భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
• 18వ తేదీన ప్రభోత్సవం, వీరాచార విన్యాసాలు
• 19న ఉగాది పర్వదినం రోజున ఉదయం పంచాంగ శ్రవణం, సాయంకాలం రథోత్సవం
ఉగాది మహోత్సవాలు సంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక , మహారాష్ట్రలోని సాంగ్లీ, షోలాపూర్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో క్షేత్రాన్నిదర్శించుకుంటున్నారు. నిన్నటి 16 న మొత్తం 98,665 మంది భక్తులు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం గం. 5.00ల వరకు 57,357 మంది భక్తులు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.
ఈ ఉగాది మహోత్సవాలలో రోజుకు 1 కోటి, 36 లక్షల, 20 వేల లీటర్ల నీటిని సరఫరా చేయడం జరుగుతోంది. క్షేత్రపరిధిలో పలుచోట్ల సుమారు 450కిపైగా మంచినీటి కుళాయిలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా త్రాగునీటికై 34 ఆర్.ఓ ప్లాంట్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. క్షేత్రపరిధిలో పలుచోట్లగల 11 ఆర్.సి.సి. వాటరు ట్యాంకులు కూడా భక్తులకు అందుబాటులో ఉంచబడ్డాయి.
భక్తులకు ఆలయ సమీపంలో గల అన్నపూర్ణ భవనంలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. అదేవిధంగా క్షేత్రపరిధిలో అన్నదానం చేసే సేవా సంస్థలకు కూడా దేవస్థానం పూర్తి సహాయ సహకారాలను అందిస్తోంది.