శ్రీశైల దేవస్థానం:
ఈ నెల 8వ తేదీన ఉదయం గం. 10.00లకు దేవస్థానం పరివార దేవాలయమైన ఫాలధార – పంచధార వద్ద శ్రీ శారదాంబా సహిత జగద్గురు ఆదిశంకరాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగనున్నది.
జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు, దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం వారి కరకమలములచే ఈ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగనున్నది.
కాగా దేవస్థానం వైదిక కమిటీ వారి సూచనల మేరకు ఈ ప్రతిష్ఠా కార్యక్రమం మార్చి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహింపబడనున్నది.
మార్చి 6వ తేదీన ఉదయం గం.8.00ల నుండి ఫాలధార – పంచధార వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో యాగశాల ప్రవేశం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం,మండపారాధనలు, చతుర్వేదపారాయణం, జలాధివాసం కార్యక్రమాలు వుంటాయి . అదేవిధంగా ఆ రోజు సాయంత్రం క్షీరాధివాసము, అధివాస హోమములు వుంటాయి.
కార్యక్రమములో రెండవ రోజైన మార్చి 7వ తేదీన అధివాసహోమములు, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయ్యాధివాసం కార్యక్రమాలు జరుగుతాయి .
అదేవిధంగా మార్చి 8వ తేదీన ఉదయం గం.8.00ల నుంచి అధివాసహోమములు, నేత్రోన్మీలనము, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు వుంటాయి.
తరువాత ఉదయం గం. 11.00ల నుంచి శ్రీ శారదాంబా సహిత ఆదిశంకరాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వుంటుంది.
భక్తులందరు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని తరించవలసిందిగా దేవస్థానం కోరింది.
