శ్రీశైల దేవస్థానం: ఈ రోజు సాయంత్రానికి పౌర్ణమి ఘడియలు రావడంతో దేవస్థానం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించింది.ఈ రోజు సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఈ గిరిప్రదక్షిణ ప్రారంభమయింది.
ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం నుండి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారిపైకి చేరుకుంది. అక్కడి నుండి సారంగధర మఠం మీదుగా సాగి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంది. హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి మహిషాసురమర్ధిని, రుద్రాక్షమఠం, విభూతిమఠాల మీదుగా రుద్రవనంలోకి చేరుకుంది. రుద్రవనం నుంచి నందిమండపం వద్దకు రావడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగిసింది.
శ్రీశైలక్షేత్రములోని ప్రాచీన మఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహించడం జరుగుతోంది.
*లక్షకుంకుమార్చన:
ఈ రోజు సాయంత్రానికి పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీ అమ్మవారికి లక్షకుంకుమార్చన జరిపారు.
ఈ లక్షకుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవగా పాల్గొనే అవకాశం కూడా కల్పించారు.
కాగా లక్షకుంకుమార్చనలో ముందుగా పూజాసంకల్పం పఠించి తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహా గణపతిపూజను నిర్వహించారు. అనంతరం లక్షకుంకుమార్చన జరిపించారు.
కాగా మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఈ కుంకుమ ద్రవ్యముతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పండితులు పేర్కొంటున్నారు.
ఈ లక్షకుంకుమార్చన జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, సంసారం వృద్ధిలోకి వస్తుందని, సంతాన సౌఖ్యం కలుగుతుందని, పూర్వజన్మ దోషాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.
శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జితసేవలను పరోక్షంగా జరిపించుకునేందుకువీలుగా దేవస్థానం ఈ ఆర్జిత పరోక్షసేవను నిర్వహిస్తోంది.
ఈ పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
భక్తులు సేవా రుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 లను సంప్రదించవచ్చును.
*పల్లకీ ఉత్సవం:
ఈ రోజు సాయంత్రానికి పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీస్వామిఅమ్మ వార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు.
ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి , మూలా నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరిపించబడుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.
అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు.
*ఊయలసేవ:
ఈ రోజు సాయంత్రానికి పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించారు.
ప్రతి శుక్రవారం , పౌర్ణమి, మూలానక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ నిర్వహిస్తున్నారు.
లక్షకుంకుమార్చన తరువాత ఈ ఊయలసేవ జరుపుతున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్నికాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.
అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపి చివరగా ఊయలసేవ నిర్వహించారు.
ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చన జరిపారు.
పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించారు.
