
శ్రీశైల దేవస్థానం:
- సామాన్య భక్తుల సౌకర్యార్థం జూలై 1న తిరిగి ప్రారంభమైన ఉచిత స్పర్శదర్శనం
- ఉచిత స్పర్శదర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన
- భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు ఆన్లైన్లో టికెట్లు
జూలై 1వ తేదీ నుంచి ప్రారంభించిన శ్రీస్వామివార్ల ఉచిత స్పర్శదర్శనానికి భక్తులనుంచి అనూహ్య స్పందన లభించిందని కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉచిత స్పర్శదర్శనం పున: ప్రారంభించిన రోజున తాను పలువురు భక్తులతో ముఖాముఖిగా సంభాషించి, వారి అభిప్రాయాలను అడగడం జరిగిందన్నారు. భక్తులందరు కూడా ఉచిత స్పర్శదర్శనం ప్రారంభం పట్ల ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. గతంలో వలనే వారంలో నాలుగురోజులపాటు మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించడం జరుగుతుందన్నారు.
ఉచిత స్పర్శదర్శన సదుపాయ ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం కార్యనిర్వహణాధికారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అన్ని విభాగాల యూనిట్ అధికారులు , పర్యవేక్షకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సామాన్య భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడంలో భాగంగానే ఈ ఉచిత స్పర్శదర్శనం పున: ప్రారంభించడం జరిగిందన్నారు. శ్రీమల్లికార్జునస్వామివారిని భక్తులు స్వయంగా స్పర్శించడం వలన ఎంతో ఆధ్యాత్మికానుభూతిని పొందుతారన్నారు.
అందుకే ఈ ఉచిత స్పర్శదర్శన నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. ఏ ఒక్క భక్తుడు కూడా ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండాలన్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవలసిన బాధ్యత దేవస్థానంపై ఉందన్నారు.
ఈ కారణంగా ఈ ఉచిత స్పర్శదర్శన విధివిధానాల గురించి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
ఉచిత స్పర్శదర్శనం పొందగోరే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు ఉచిత స్పర్శదర్శన టోకెన్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయా ఆర్జితసేవాటికెట్లను పొందినట్లుగా భక్తులు ఉచిత స్పర్శదర్శనం టికెట్లను కూడా ఆన్లైన్ ద్వారానే పొందవలసి వుంటుంది.
కాగా ఉచిత స్పర్శదర్శనానికి సంబంధించి రోజుకు 1000 టోకన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. భక్తులు www.srisailadevasthanam.org లేదా www. aptemples.ap.gov.in ద్వారా ఈ ఉచిత టోకన్లు పొందవచ్చు. ప్రస్తుతం పరోక్ష సేవ విధానానికి అమలులో ఉన్నట్లుగానే ఈ ఉచితటోకన్లు కూడా భక్తులు ఒక్కరోజు ముందుగా ఆన్లైన్ ద్వారా పొందవలసివుంటుంది. అనగా మంగళవారం మధ్యాహ్నం స్పర్శదర్శనం చేసుకోవలసిన భక్తులు సోమవారం నాడే నిర్ధిష్ట సమయంలోగా ఈ టోకన్లు ఆన్లైన్ నందు పొందవలసివుంటుంది.
ఆన్లైన్ లో టోకన్లు పొందే సమయంలో భక్తుల పేరు, చిరునామా, ఆధార్ ్నం , ఫోను నెంబర్లను విధిగా నమోదు చేయవలసి వుంటుంది.భక్తులు ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్లను స్కానింగ్ చేయడం ద్వారా , ఆధార్ గుర్తింపుతో పోల్చిన తదుపరే భక్తులను దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. ఉచిత స్పర్శదర్శనం విధానంలో పారదర్శకత , జవాబుదారీతనం కోసం ఈ ఆన్లైన్ టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతోంది.
కాగా మధ్యాహ్నవేళల తరువాత ఆలయశుద్ధి, మంగళవాయిద్యాలు, సుసాంధ్యము, ప్రదోషకాల పూజలను నిర్వహించవలసి వున్నం దున మధ్యాహ్నం గం. 1.45ల నుంచి ఈ ఉచిత స్పర్శదర్శనం కల్పించబడుతోంది.
కాగా ఎవరైనా ఈ ఉచిత ఆన్లైన్ టోకెన్ విధానాన్ని దుర్వినియోగం చేసినట్లయితే చట్టప్రకారం తగు చర్యలు వుంటాయి . భక్తులందరు కూడా తగువిధంగా ఆన్లైన్ ద్వారా టోకన్లను పొంది, స్వామివారి ఉచిత స్పర్శదర్శనాన్ని పొందవలసినదిగా కోరుతున్నాము.