తెలంగాణ పరిశ్రమల విధానం ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది : మంత్రి హరీష్ రావు
గురువారం హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా నాణ్యత, దాని ఉద్దేశాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సాగునీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమలతో రాష్ట్రం ఆయా రంగాల్లో ప్రగతి సాధిస్తూ బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిశ్రమల విధానం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నదన్నారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు విరివిగా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని, విద్యుత్, నీళ్లు నిరాటంకంగా అందే అవకాశాలున్నాయని ప్రస్తుత సీఎం, అప్పటి ఉద్యమనేత కేసీఆర్ ఆ సమయంలో పేర్కొన్నారని చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో కోతల్లేని విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్‌ను పూర్తిస్థాయిలో అందించడమే కాకుండా నీటి వనరులతో నిర్వహించే పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉండేలా గోదావరి జలాలను ఉపయోగించుకొనేందుకు ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు.
గతంలో నదీజలాలు ఉన్నచోట పరిశ్రమలు నెలకొల్పే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు రిజర్వాయర్‌ల ద్వారా పరిశ్రమలు ఉన్న చోటుకు నీటిని మళ్లించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిందన్నారు. రాష్ర్టానికి చెందిన సీహెచ్ విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేయడం గర్వంగా ఉందని, ఆయన పనితీరు నిబద్ధతను దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం తమిళనాడు రాష్ర్టానికి ఇన్‌చార్జ్ గవర్నర్‌గా నియమించారన్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి క్వాలిటీ సర్కిల్ ఫోరం ద్వారా గవర్నర్ విద్యాసాగర్‌రావు, సాగునీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అవార్డులను అందజేశారు.