ఎంసెట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన సంఘటన – ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆవేదన
ఎంసెట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన సంఘటన అని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నా పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో తిరిగి ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు సిఎం వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహృదయంతో పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని సిఎం అభ్యర్థించారు. విద్యార్థులతో మరోసారి పరీక్ష రాయించడం బాధాకరమైన విషయమని సిఎం అన్నారు. ఈ సాయంత్రానికి ఎంసెట్ పరీక్ష షెడ్యూల్ ప్రకటించాలని ఉన్నత విద్యామండలి, హెల్త్ యూనివర్సిటీ, జె.ఎన్.టి.యు.లను ముఖ్యమంత్రి ఆదేశించారు.
లీకేజిపై విస్తృత చర్చ
———————
ఎంసెట్ ప్రశ్నా పత్రాల లీకేజి గుట్టురట్టయిన నేపథ్యంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్ తివారి, జె.ఎన్.టి.యు. విసి వేణుగోపాల్ రెడ్డి, హెల్త్ యూనివర్సిటీ విసి కరుణాకర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజి శివధర్ రెడ్డి, సిఐడి ఐజి సౌమ్య మిశ్రా, సిఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఎంసెట్ ప్రశ్నా పత్రాల లీకేజికి సంబంధించిన అంశాలపై సమీక్ష జరిపారు. ఢిల్లీ కేంద్రంగా దేశ వ్యాప్తంగా పేపర్ల లీకేజీ రాకెట్ పనిచేసిందని ఇప్పటి వరకు సాగిన దర్యాప్తులో వెల్లడైందని అధికారులు ఈ సమావేశంలో తెలిపారు. ముకుల్ జైన్, మయాంక్ శర్మ, సునిల్ సింగ్, ఇక్బాల్ లు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించగా, 34 మంది బ్రోకర్లు ఈ లీకేజి వ్యవహారంలో కుట్రదారులుగా తేలారు. వీరిలో ఇప్పటికే ఆరుగురు అరెస్టు కాగా, మరో ఐదారుగురి ఆచూకి కూడా లభ్యమైంది. ఏ క్షణంలోనైనా వారి అరెస్టులు జరగవచ్చు. దాదాపు 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులు బ్రోకర్లతో సంప్రదిపుంలు జరిపి పేపర్ల లీకేజీ కుట్రలో పాలుపంచుకున్నట్లు ఇప్పటిదాకా సాగిన దర్యాప్తులో వెల్లడైంది. పేపర్ల లీకేజి దృవపడిన నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి పరీక్ష నిర్వహించకుండా అనుసరించే మార్గాలపై చర్చ జరిగింది.
గత అనుభవాలు కూడ తిరిగి పరీక్ష నిర్వహణ వైపే మొగ్గు
———————————————————-
ప్రశ్నా పత్రాల లీకేజి జరిగినప్పుడు గతంలో ఎలా వ్యవహరించారు? ఇప్పుడు ఎలా వ్యవహరించాలి? ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి దాకా 70 సందర్భాల్లో ప్రధాన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయని, అన్ని సందర్భాల్లో తిరిగి పరీక్షలు నిర్వహించారని అధికారులు వెల్లడించారు. పేపర్ల లీకేజి జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏమి చేయాలనే విషయంలో గతంలో వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ముఖ్యమంత్రి తెప్పించుకుని పరిశీలించారు. దాదాపు అన్ని సందర్భాల్లో కోర్టులు తిరిగి పరీక్ష పెట్టాలనే సూచనలు, ఆదేశాలే ఇచ్చాయి. కొద్ది మంది చేసిన తప్పుకు వేల మంది విద్యార్థులను ఇబ్బంది పెట్టి తిరిగి పరీక్ష రాయించడం బాధాకరమే అయినప్పటికీ, తప్పని పరిస్థితుల్లో మళ్లీ పరీక్ష పెట్టవలసి వస్తున్నదని ముఖ్యమంత్రి ప్రకటించారు.
పరీక్ష ఫీజు మాఫీ, ఉచిత ప్రయాణం, ఆన్ లైన్లో స్టడీ మెటీరియల్
—————————————————————
ఎంసెట్-2 రాసిన విద్యార్థులు తిరిగి దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా, మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పాత హాల్ టిక్కెట్లతోనే అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆన్ లైన్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పారు. పరీక్ష రాయడానికి వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైన చోట ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు. విద్యార్థులు ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యేందుకు జె.ఎన్.టి.యు వెబ్ సైట్ లో స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ విత్ ఆన్సర్స్, ఇతర సమాచారం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సిఎం వెల్లడించారు. ఈ సాయంత్రం వరకే షెడ్యూల్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
జె.ఎన్.టి.యుకే పరీక్ష నిర్వహణ బాధ్యతలు
——————————————–
ఎంసెట్ -2ను తిరిగి నిర్వహించే బాధ్యతను మరోసారి జె.ఎన్.టి.యు. కే అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం కొత్త కన్వీనర్, కో కన్వీనర్, ఇతర సభ్యులను నియమించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రతీ విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలని జెఎన్టియు విసిని సిఎం ఆదేశించారు. పాత హాల్ టికెట్లతోనే విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తున్నందున, అందుకు సరిపడే విధంగా ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసి, ముందుగానే విద్యార్థులకు సమాచారం అందించాలని సిఎం చెప్పారు.
తల్లిదండ్రులు సహకరించాలి: సిఎం
———————————-
పేపర్ల లీకేజి నేపథ్యంలో తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా ప్రభుత్వానికి మరోమార్గం లేనందున తల్లిదండ్రులు సహకరించాలని సిఎం విజ్ఞప్తి చేశారు. అనవసరంగా ఆందోళన చెంది విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. జరగకూడనిది జరిగినప్పుడు కొంత మందికి ఇబ్బంది కలగడం తప్పదని, దీన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలని సిఎం కోరారు. ఆందోళన చెంది సమయాన్ని వృధా చేసుకునే బదులు, తిరిగి నిర్వహించే పరీక్ష కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని సిఎం కోరారు.
దర్యాప్తు పకడ్బందీగా జరపాలి
——————————
ఎంతో మంది విద్యార్థుల మనోవేదనకు కారణమైన ఎంసెట్ పేపర్ల లీకేజీ వ్యవహారంలో పకడ్బందీగా దర్యాప్తు జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి పోలీస్ అధికారులను ఆదేశించారు. నిందితులు ఎంతటి వారైనా, ఎక్కడున్నా అరెస్టు చేసి విచారించాలని చెప్పారు. మళ్లీ పేపర్ల లీకేజీ సంఘటనలను పునరావృతం కాకుండా చర్యలుండాలని చెప్పారు. బ్రోకర్లతో చేతులు కలిపిన విద్యార్థుల తల్లిదండ్రులపై కూ చట్ట ప్రకారం వ్యవహరించాలని ఆదేశించారు.