తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల కార్యక్రమంతోపాటు, గుండ్లపోచంపల్లి , పాశమైలారం అప్పారెల్ ఎక్స్ పోర్ట్ పార్కుల పనుల పురోగతి పై టెక్స్టైల్ శాఖ మంత్రి కెటి రామారావు ఈరోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో టెక్స్టైల్ శాఖ అధికారులతో పాటు బతుకమ్మ చీరలు తయారు చేస్తున్న సిరిసిల్ల మాస్టర్ వీవర్లు, మాక్స్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన 90 లక్షల బతుకమ్మ చీరల ఆర్డర్ని కచ్చితంగా బతుకమ్మ పండగకు కనీసం వారం రోజులు ముందు సెప్టెంబర్ మాసాంతానికి అందివ్వాల్సిందేనని మంత్రి తెల్చిచేప్పారు. ప్రస్తుతం చీరలను వేస్తున్న వేగాన్ని, లూమ్ లను మరింతగా పెంచి డబుల్ షిఫ్టుల్లో పని చేయాలని కోరారు. సిరిసిల్లలో ప్రస్తుతం పదివేల లూములపైన చీరల నేత కార్యక్రమం నడుస్తోందని మంత్రికి ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. నిర్ణీత ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకునేందుకు కనీసం 20,000 లూములపైన చీరల ఉత్పత్తి జరగాల్సి ఉందని ఈ మేరకు త్వరలోనే ఉత్పత్తి రెట్టింపు చేస్తామని సిరిసిల్ల మాక్స్ సొసైటీ సంఘ ప్రతినిధులు తెలిపారు. వచ్చేవారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జౌళీశాఖ మంత్రి స్మ్రితి ఇరానీని కలుస్తానని పవర్లూమ్ అప్ గ్రేడేషన్ పథకంలో ఎదురవుతున్న సమస్యలను, సవాళ్ళను అమె దృష్టికి తీసుకెళ్తానని మంత్రి సిరిసిల్ల నేతలకు హామీ ఇచ్చారు.