సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక – వైయస్ జగన్
తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు మురళి, ముత్యాలరాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు.
కరోనా వైరస్ వల్ల సిమెంట్, స్టీల్ సరఫరాపై తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వివరించారు. ఏప్రిల్ 20 నుంచి పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని, సిమెంట్, స్టీల్ సరఫరా ఇప్పుడిప్పుడే మొదలవుతుందని చెప్పారు. సిమెంటు, స్టీల్ సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలవరం స్పిల్‌వే జూన్ నెలాఖరు నాటికి పూర్తిచేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు.
ప్రాజెక్టు పనులకు సంబంధించి సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని, ఆ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్లాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం గోదావరి వరదల్లో ముంపునకు గురైన ప్రతి కుటుంబాన్ని శరవేగంతో తరలించాలని, వారికి పునరావాస కార్యక్రమాలు వేగంగా చేపట్టాలన్నారు.
పోలవరంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న అవుకు టన్నెల్–2, వలిగొండ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి లింకు పనులపై కూడా సీఎం సమీక్ష జరిపారు. నిర్దేశించుకున్న సమయంలోగా పనులు పూర్తికావాలన్నారు.
Post Comment