అమరావతి, జూలై 13: ప్రాధాన్యతా రంగాలకు బ్యాంకర్లు సహకరించాలని, సకాలంలో బ్యాంకు రుణాలివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లను కోరారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో శుక్రవారం ఆయన 203వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో 2018-19 వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. పరీక్షలు రాసే విద్యార్ధుల్లా ప్రతి మూడు నెలలకు ఒకసారి వృద్ధిరేటు తనకు ఒక పరీక్ష అని, సమీక్షించుకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. నెలవారీగా ప్రణాళికా బద్ధంగా ఇంక్లూసివ్‌నెస్ పై కార్య ప్రణాళికలు రూపొందించుకోవాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి సూచించారు. తద్వారా వృద్ధిరేటును, ప్రజల్లో సంతోష శాతాన్ని, వృద్ధిని అంచనా వేయవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. అనేక బ్యాంకులు ప్రతిభా సామర్ధ్యాలు నిరూపించుకోలేకపోతున్నాయని, బ్యాంకులను కాపాడుకోవటం మీ బాధ్యత కాదా అని ఆయన బ్యాంకర్లను ప్రశ్నించారు.
ప్రాధాన్యతా రంగానికి సమ్మిళిత పద్ధతిలో వనరులను సమీకరించి వ్యయం చేస్తున్నామని తెలిపారు. కాగా పెద్దనోట్ల ఉపసంహరణతో దేశమంతా బ్యాంకులు డిపాజిట్లు లేక ఇబ్బందులు పడితే, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులలో చేరిన డిపాజిట్లలో 9% వృద్ధిని గమనించవచ్చని ఓ అధికారి తెలుపగా ప్రణాళిక ప్రకారం పనిచేయాలని తెలిపారు.
తాము అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, అనంతపురం ఎడారి గా మారిందని, రైతులు వ్యవసాయం వదలివేసి, పంటవిరామం ప్రకటించిన దుస్థితి నెలకొందని అయితే వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగమిషన్‌గా తీసుకుని ఒక దార్శనికతతో ముందుకు సాగినట్లు, ఎరువులు, సూక్ష్మ పోషకాలను సకాలంలో ఇచ్చి ఉత్పాదన పెంచామని, తద్వారా రైతులలో ధైర్యం వచ్చిందని ముఖ్యమంత్రి వివరించారు. సకాలంలో రుణాలు అందకపోవడమే సమస్య అన్నారు. వ్యవసాయరంగాన్ని సంస్కరణలతో ఆధునీకరించినట్లు చెబుతూ ఇ-క్రాపింగ్, జియోట్యాగింగ్ విధానాలను ఉదహరించారు. గత నాలుగేళ్లలో వ్యవసాయంలో స్థిరత్వం వచ్చిందని, పద్ధతి ప్రకారం సమస్యలను అధిగమించామని తెలిపారు. పద్థతి లేకుండా వెళితే సమస్యలు వస్తాయని, తాము పరిపాలనా సమాచారాన్ని ఆన్‌లైన్ లో ఉంచి పారదర్శకత పాటిస్తున్నామని, అన్ని సర్టిఫికెట్లను ఆన్ లైన్ ద్వారా ఇస్తున్నామని ముఖ్యమంత్ తెలిపారు. పశుగణాభివృద్ధి, పాడిపరిశ్రమ గ్రామీణాభివృద్ధికి ఊతమిస్తుందని, సుస్థిర, సమ్మిళిత అబివృద్ధికి తోడ్పడుతుందని, ఈ రంగానికి బ్యాంకర్లు చేయూతను అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రుణాల మంజూరు నుంచి రుణాలివ్వడం దాకా వివరాలన్నింటినీ ఆన్ లైన్ లో ఉంచాలని కోరారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యాన రంగం అధికారులతో కలసి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్.ఎల్ బీ.సి కి మినిట్స్ రాసుకొని అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు ఆదాయాన్ని పెంచే రైతు ఉత్పాదక సంస్థలలో సభ్యుల సంఖ్యపై ఒక బ్యాంకర్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి స్పందిస్తూ ఒక సంఘంలో 50, మరో సంఘంలో 75 ఉండవచ్చని, ఇలాంటి పది పదిహేను సంఘాలను ఒక సమ్మేళనంగా (కాన్ఫెడరేషన్) గా తీర్చిదిద్దవచ్చని సూచించారు. ఫార్వర్డ్, బ్యాక్ వర్డ్ ఇంటిగ్రేషన్ పద్ధతులు ఉంటాయన్నారు. తాము కోటి ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగుచేయాలన్న లక్ష్యంతో ఒక ప్రణాళిక రూపొందించుకుంటే తొలిదశలో సమస్యలు వచ్చాయని తెలిపారు.
చిత్తూరు మామిడి రైతును ఆదుకున్నాం: ముఖ్యమంత్రి
గత ఏడాది చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి కాయలు కిలో ఒక్కింటికి రూ.8 రూపాయల ధర ఉంటే ఈ ఏడాది ఒకేసారి రూ.4 రూపాయలకు పడిపోతే తాము జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. పల్ప్ ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. తాము కోల్డ్ చెయిన్‌ను అభివృద్ధి చేశామని, ప్రభుత్వం కిలో తోతాపురి మామిడి ఒక్కింటికి రూ.2.50 పైసలు సబ్సిడీ ఇవ్వగా, ఫ్యాక్టరీ యజమానులు రూ.5 చెల్లించారని దాంతో కిలో.రూ.7.50 పైసలతో రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతాలలో అనేక గ్రామాలలో ఒకే బ్యాంకు శాఖలున్నాయని ఓ అధికారి చెప్పారు. బ్యాంకింగ్ ఏజెంట్ల ద్వారా బ్యాంకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేయగా, సాధికార మహిళల సహకారం తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగానికి చేయూతను అందించే కార్యక్రమాల్లో రైతు సాధికార సంస్థతో కలసి పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించుకొని సమీక్షించుకోవాలని, సబ్ కమిటీలు సమావేశం కావాలని సీఎం సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని 15% తగ్గించగలిగామని వ్యవసాయాధికారి తెలుపగా, ఇంకా తగ్గించవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.
తాను అధికారం లోకి వచ్చిన సమయంలో ఏ ఒక్క రంగంలో పరిస్థితి సానుకూలంగా లేదని, అంతా నిరాశాజనకంగా ఉందని, విభజనతో రాజధాని లేదని, తాను పనిచేయడానికి కార్యాలయం లేదని, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, అనంతపురం జిల్లా ఎడారిలా ఆందోళన కలిగించిందని గుర్తు చేశారు. వచ్చిన మూడు నెలలకు హుద్ హుద్ తుఫాను విరుచుకుపడిందని, ప్రజలు, అధికారుల సహకారంతో అన్ని సంక్షోభాలు అధిగమించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కష్టపడి రెండంకెల వృద్ధిరేటు తీసుకొచ్చామన్నారు.
ఐటీ, ఇంటర్ నెట్ సమాహారంగా వచ్చిన ఐఓటీ పరిజ్ఞానంతో పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమం తమకు సమప్రాధాన్యాలని అంటూ పెన్షన్ల చెల్లింపులో, నరేగా పథకం అమలులో లేదా చంద్రన్న బీమా..ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా ఆన్ లైన్ ద్వారా చేపట్టి రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా అమలు చుస్తూ పారదర్శకత పాటిస్తున్నామని అన్నారు. తాము విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన పెద్ద పరిశ్రమ కియా కార్ల పరిశ్రమ అని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్-1 గా మనం ఉండటం దగ్గర నుంచి పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య అనుకూలాంశాలు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేశాయని వివరించారు. ప్రజల ఆహారపుటలవాట్లు మారుతున్నాయని, అందుకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు తెచ్చామని, ఉద్యాన పంటల్ని భారీగా ప్రోత్సహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణయించుకుని పనిచేస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని, వ్యవసాయం, ఆరోగ్యం..ఇంకా అనేక రంగాలు మెరుగైన ఫలితాలతో అగ్రగాములుగా ఎదిగాయని అన్నారు. జీఎస్డీపీ కి వ్యవసాయరంగంనుంచే 34% వస్తోందన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం లాంటి ఆదాయం లేని జిల్లాలున్నాయని,కడప, కర్నూలు ఫర్వాలేదని, అందుకే తాము అన్ని జిల్లాలు సమంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు.
తాను ఎస్.ఎల్.బి.సి సమావేశాలు నిర్వహిస్తూ బ్యాంకర్లతో సంభాషించేది లబ్దిదార్లకు మరింత మేలు చేకూర్చాలన్న ఉద్దేశంతోనే అన్నారు. సమావేశాల్లో యాంత్రికత వద్దని, రొటీన్ గా సమావేశాలు ఉండకూడదని చెప్పారు. యువజనాభా, టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ బలమని, అందుకే అనేక రంగాల్లో నెంబర్-1గా నిలిచామని అన్నారు. ఒక అజెండాతో ముందుకెళ్లాలని, సమావేశాలు మూసపోసినట్లు ఉండకూడదన్నారు.
2018-19 వార్షిక రుణ ప్రణాళిక రూ. 1,94,220 కోట్లు
అమరావతి: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక (2018-19) ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
మొత్తం వార్షిక రుణ ప్రణాళిక 2018-19: రూ. 1,94,220 కోట్లు. ప్రాధాన్యతా రంగం: రూ.1,44,220 కోట్లు .ప్రాధాన్యేతర రంగం: రూ.50,000 కోట్లు. భారీ పరిశ్రమలు రూ.10,457 కోట్లు. ఎం.ఎస్. ఎం.ఇ రూ.3,745 కోట్లు. మైక్రో ఎంటర్ ప్రైసెస్: రూ.14,028. స్మాల్ ఎంటర్ ఫ్రైసెస్ రూ.11,500 కోట్లు. మీడియం ఎంటర్ ప్రైసెస్: 2,733 కోట్లు. మొత్తం ఎం.ఎస్ ఎం.ఇ రుణాలు రూ.28,261 కోట్లు.
వ్యవసాయ రుణ ప్రణాళిక మొత్తం: రూ.1,01,564 కోట్లు
కాగా స్వ వ్యవసాయ రుణ ప్రణాళిక మొత్తం రూ.1,01,564 కోట్లు. స్వల్పకాలిక ఉత్పాదక రుణాలు రూ. రూ.75,000 కోట్లు. వీటిలో కౌలు రైతులకు ఆర్ధిక సాయం రూ.7,500 కోట్లు. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు రుణాలు రూ.21,323 కోట్లు. వ్యవసాయ మౌలిక సదుపాయాలు రూ.241 కోట్లు
అనుబంధ కార్యక్రమాలకు రూ. 5,000 కోట్లు వరుసగా ప్రతిపాదించారు.
రేపే ‘వనం-మనం’ మహాయజ్ఞం
అమరావతి, జులై 13 : రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే మహా యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జూలై 14న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు ‘వనం-మనం’ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జూలై 14న కృష్ణా జిల్లా నూజివీడు నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్వయంగా శ్రీకారం చుట్టనున్న ఈ కార్యక్రమం కార్తీక మాసంలో నిర్వహించే ‘వనమహోత్సవం’ వరకూ 127 రోజులపాటు నిరాటంకంగా కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములయ్యేలా చూడాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాలవారీగా మొక్కల నాటే బాధ్యతను మంత్రులతో పాటు ప్రతిఒక్కరూ తీసుకోవాలని చెప్పారు. కోటి మొక్కల సంకల్పానికి అన్ని రకాల మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని, అందరినీ సంసిద్ధులు చేయాలని చెప్పారు.
శుక్రవారం ఉండవల్లిలోని గ్రీవెన్ హాల్ లో ‘వనం-మనం’ కార్యక్రమంపై అటవీ, పర్యావరణ శాఖ, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 26 శాతంగా వున్న అటవీ విస్తీర్ణాన్ని 2029 నాటికి 50 శాతానికి పెంచడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేలా అధికారులు కార్యాచరణ చేపట్టాలన్నారు. హరితాంధ్రప్రదేశ్ సాకారానికి అవసరమైన నిధుల సమీకరణపైనా దృష్టి పెట్టాల్సిందిగా అధికారులతో అన్నారు. నరేగా నిధులను భారీఎత్తున వినియోగించుకోవచ్చని సూచించారు. రైల్వే లైన్లకు, రహదారులకు ఇరువైపులా చెట్లు పెంచాలన్నారు. ‘అటవీ ప్రాంతంలో పడ్డ ఒక్క చుక్క వర్షం నీరు వృధా కాకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. అటవీప్రాంతం చుట్టూ కందకాలు తవ్వాలని చెప్పారు. చెక్‌డ్యాంలు, రాక్‌ఫిల్ డ్యాంలు పెద్దఎత్తున నిర్మించాలని సూచించారు. అటవీ ప్రాంతంలో నీరు నిల్వ ఉండేలా చూస్తే అడవులు, వన్యప్రాణుల సంరక్షణ జరగడమే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు.
‘నాటే ప్రతి మొక్క చెట్టు అవ్వాలి, పాఠశాలలు సహా వివిధ ప్రాంతాల్లో నాటే మొక్కల వల్ల అందం రావాలి, ఎలాంటి మొక్కలు పెట్టాలి అన్న విషయంలో పూర్తి స్పష్టతతో ముందుకు వెళ్ళాలి. నాటే మొక్కలు పర్యావరణ హితమైనవి. ఆరోగ్యానికి మేలు చేసేవేకాకుండా ఫలాలు ఇచ్చేవి అయుండాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. వృక్ష మిత్రలను నియమించి ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించే లక్ష్యాన్ని ప్రతి ఒక్కరు ప్రతి క్షణం, గుర్తుపెట్టుకొని బాధ్యతతో ఒక యజ్ఞంలా ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. 10 ఏళ్ల పాటు ఏడాదికి 50 కోట్ల మొక్కలు నాటగలిగేతే హరితాంద్ర సాధన పూర్తవుతుంది. ఇందుకోసం నర్సరీల పెంపకానికి ప్రత్యేకంగా ఒక డీఎఫ్ఓ స్థాయి అధికారిని నియమించాలని అధికారులకు సూచించారు.
మొక్కలు పెద్దసంఖ్యలో నాటే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కరిని ప్రకృతికి దగ్గర చేయడమే ఆశయంగా వుండాలని చెప్పారు. చెట్ల పెంపకం కార్యక్రమం, విత్తనాల సేకరణ కార్యక్రమాలు ఏడాది పొడవునా చేపట్టాలని స్పష్టం చేశారు. మన వాతావరణ పరిస్థితులను తట్టుకుని త్వరగా పెరిగే మొక్కలను ఎంచుకోవాలని అన్నారు. ఇందుకోసం ఉద్యాన, అటవీ శాఖలు సంయుక్తంగా పరిశోధనలు చేయాలన్నారు. అమెరికా తరహాలో చెట్ల క్లోనింగ్ పద్దతి ఇక్కడా రావాలని చెప్పారు. అటవీప్రాంతాల్లో నేరేడు, మారేడు, ఉసిరి, వంటి ఔషద గుణాలున్న మొక్కలతో పాటు సీతాఫలం లాంటి పండ్లమొక్కలు విస్తృతంగా నాటాలని సూచించారు. ప్రాంతాలవారీగా మొక్కల పెంపకాన్ని డ్వాక్రా గ్రూపులకు అప్పగించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను వారికే ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి స్కూలు, కాలేజి, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల ప్రాంగణాలు వంటి మొక్కలకు రక్షణ కల్పించతగిన అన్ని చోట్లా తప్పనిసరిగా మొక్కల పెంపకం జరగాలని అన్నారు. జలవనరులకు సమీపంలో చెట్లను పెంచడం ద్వారా నీటి సంరక్షణ కూడా సాధ్యమవుతుందని అన్నారు.
రాష్ట్రంలోని ఐదు పక్షి సంరక్షణ కేంద్రాలను అభివృద్ధి చేయాలని, మడ అడవులను పెద్ద ఎత్తున పెంచడం ద్వారా తీరప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించే వీలుందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలను ఆహ్లాదకరంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రైవేట్ సంస్థల సాయం తీసుకోవాలని సూచించారు. నగరవనాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, నగరవనాల్లో నెమళ్లు, ఆయుర్వేద వనాల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
సమీక్షలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, కార్యదర్శి రాజమౌళి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.