సమాజంలోని అన్ని వర్గాలలోని పేదల అభ్యున్నతికి కృషి జరిగినట్లే బ్రాహ్మణుల సంక్షేమానికి, ఆ సామాజికవర్గంలోని పేదల అభివృద్ధికి ప్రభుత్వం త్రికరణ శుధ్దిగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో పది పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో బ్రాహ్మణ సదనం నిర్మిస్తామని, ఆ సదనం వేదికగా బ్రాహ్మణుల అభివృద్ది, సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బడ్జెట్లో ఇప్పటికే వంద కోట్లు కేటాయించామని, వాటితో బ్రాహ్మణుల కోసం పనిచేయడానికి బ్రాహ్మణ ట్రస్టు బాధ్యత వహిస్తుందని సిఎం ప్రకటించారు.
ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డిలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై జరిగిన సమావేశంలో సిఎం మాట్లాడారు. మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారి, విద్యాసాగర్ రావు, ఎంపి కెప్టెన్ లక్ష్మికాంతరావు, వేణుగోపాలచారి, ఎమ్మెల్యే వి.సతీష్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, మాజీ డిజిపి అరవిందరావు, ఎపి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్. కృష్ణారావు, సిఎల్. రాజం, మృత్యుంజయశర్మ, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బ్రాహ్మణులతో తనకు, తన కుటుంబానికి దశాబ్దాలుగా అనుబంధం వుందన్నారు. 1985లో తాను ఎమ్మెల్యేగా వున్నప్పుడే దేశంలోనే మొదటి సారిగా సిద్దిపేటలో బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నిర్మించినట్లు వెల్లడించారు. బ్రాహ్మణుల జీవన స్థితిగతులను తాను దగ్గరుండి చూశానని, బ్రాహ్మణుల ఆశీర్వాదంతో ఎదిగానని సిఎం చెప్పారు. ముహూర్తాలు లేని సమయంలో బ్రాహ్మణులు అనుభవించే ఆర్థిక సమస్యలు కూడా తనకు తెలుసన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. కొత్త పథకాలు తెస్తున్నాం. అదే క్రమంలో బ్రాహ్మణులు కూడా నిర్లక్ష్యానికి గురికావద్దు, వారి పేదరికాన్ని కూడా తొలగించాల్సి వుంది. నిజానికి బ్రాహ్మణులు చేసే సేవ సమాజసేవ. ఎవరెంత ఉన్నతస్థానంలో వున్నా, అంతిమంగా మనఃశ్శాంతి కోసం గుడికే వెళ్తాం. అక్కడ బ్రాహ్మణులు ఆశీర్వదించి మంచి కోరతారు. అలాంటి బ్రాహ్మణుల మంచిని ప్రభుత్వం కోరుతున్నది. అందుకే బ్రాహ్మణుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. బడ్జెట్ లో వంద కోట్లు కేటాయించాం. వాటి ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించే బాధ్యతను బ్రాహ్మణ ట్రస్టుకు అప్పగిస్తాం’’ అని సిఎం చెప్పారు.
‘‘హైదరాబాదులో అన్ని హంగులతో బ్రాహ్మణ సదనం నిర్మిస్తాం. అక్కడ ఆచారం, సంప్రదాయం, మడి, పవిత్రత నెలకొనే విధంగా చర్యలు తీసుకుంటాం. దేశ వ్యాప్తంగా ఎవరు హైదరాబాద్ వచ్చినా వారికి అక్కడ వసతి కల్పిస్తాం. అదే చోట బ్రాహ్మణ విద్యార్థులకు హాస్టల్ నిర్మిస్తాం. విదేశి విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఇస్తాం’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
సిఎం కేసిఆర్ దార్శనికుడుః ఐవైఆర్. కృష్ణారావు
———————————————————–
‘‘ముఖ్యమంత్రి గొప్ప దార్శనికుడు. మిషన్ భగీరథ, నీటి పారుదల ప్రాజెక్టులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ లాంటి నిర్ణయాలు ఆయన దార్శనికతకు అద్దం పడుతున్నాయి. బ్రాహ్మణుల పట్ల సిఎం చూపిస్తున్న ఆదరణ, గౌరవం చాలా గొప్పది. మానవతా హృదయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది నా హృదయాంతరంగాల్లోంచి చెబుతున్న మాట’’ అని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ ఐవైఆర్. కృష్ణారావు అన్నారు.
బ్రాహ్మణ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై కృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారు కెవి. రమణాచారి, ప్రముఖ జర్నలిస్టు తిగుళ్ల కృష్ణమూర్తి, గంగు ఉపేంద్ర శర్మ, రంగరాజన్ (చిల్కూరి బాలాజి), అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, మాజి డిజీపి అరవిందరావు సూచనలు చేశారు.
‘‘వేద విద్యను ప్రోత్సహించాలి. ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే వారికి ఆర్థిక చేయూతనివ్వాలి. సంప్రదాయలు కాపాడే వారికి, ఆధ్యాత్మిక రచనలు చేసే వారిని ఆర్థికంగా ప్రోత్సహించాలి’’ అని కెవి. రమణాచారి అన్నారు.
‘‘తెలంగాణ వచ్చిన తర్వాత బ్రాహ్మణులకు గౌరవం పెరిగింది. కేసిఆర్ గారి వల్ల ఆత్మాభిమానంతో బతుకుతున్నాం’’ అని రంగరాజన్ చెప్పారు.
‘‘2014 జూన్ 2 తర్వాత బ్రాహ్మణులకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. బ్రాహ్మణులు పాలకులుగా ఉన్నప్పుడు కూడా బ్రాహ్మణుల గురించి ఆలోచించలేదు. కేసిఆర్ సమర్ధ నాయకత్వం వర్ధిల్లినంత వరకు బ్రాహ్మణులు నిశ్చింతగా వుండవచ్చు’’ అని ప్రభాకర్ రావు అన్నారు.
‘‘దూప దీప నైవేద్యానికి కేసిఆర్ ఎక్కువ నిధులు ఇచ్చారు. అర్చకుల సమస్యలు తీరుస్తారనే నమ్మకం వుంది’’ అని గంగు ఉపేంద్ర శర్మ చెప్పారు.
‘‘తెలంగాణలో సంస్కృత విశ్వవిద్యాలయం నెలకొల్పాలి’’ అని అరవిందరావు కోరారు.
‘‘దేవాలయాలను విజ్ఞాన కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. శాస్త్రీయ కళలను ప్రోత్సహించాలి’’ అని మాజీ డిజీపి ప్రభాకర్ రావు అన్నారు.
‘‘జ్యోతిష్య శాస్త్రాన్ని, వేదాలు, స్మార్థం అధ్యయనం చేసేందుకు ప్రొత్పాహం, ఆర్థిక సహాయం అందించాలి’’ అని తెలంగాణ పత్రిక ఎడిటర్ అష్టకాల రామోహన్ శర్మకోరారు.
‘‘బ్రాహ్మణుల కోసం చేసే ఖర్చు విద్య, వైద్య వివాహాది అంశాలకు ప్రాధాన్యతా క్రమంలో వుండాలి’’ అని డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ రావు అన్నారు.
‘‘ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రొత్సహించాలి. నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి నిధులు కేటాయించాలి. బ్రాహ్మణుల్లో మహిళలను ప్రోత్సహించాలి’’ అని పారిశ్రామికవేత్త సిఎల్. రాజం విజ్ఞప్తి చేశారు.
‘‘ఆలయాల అభివృద్ధికి గతంలో ఏ ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకోలేదు. దేవాలయాలు అభివృద్ధి చెందితే వేద పండితులు కూడా ఉపాధి పొందుతారు’’ అని డాక్టర్ విశ్వనాథం (వరంగల్) అన్నారు.
‘‘కొత్త ఆలోచనలు, సృజనాత్మకత వున్న వారిని ప్రోత్సహించాలి. వారి వారి అభిరుచిని బట్టి సహకారం అందివ్వాలి’’ అని పివి. ప్రభాకర్ రావు అన్నారు.
‘‘చిత్తశుద్ది, అంకిత భావం కలిగిన వారిని ట్రస్టీలుగా నియమిస్తేనే ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం చేసే ఖర్చు సద్వినియోగం అవుతుంది. ధర్మసంరక్షణార్థం పనిచేస్తూ పేదరికం అనుభవించే బ్రాహ్మణులను పట్టించుకోవడం మంచి కర్తవ్యం’’ అని విజిలెన్స్ కమిషనర్ కె.ఆర్.నందన్ అన్నారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాలు, వెల్లడించిన అంశాలు:
———————————————————————–
– సమాజంలో ఆధ్యాత్మికత పెరిగింది. దేవాలయాల నిర్మాణాలు పెరిగాయ్. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి
– దేవాలయం కోసం కేటాయించిన భూములు, మాన్యాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలి
– బ్రాహ్మణుల్లో పేదల సంక్షేమం కోసం బహుముఖ వ్యూహం అవలంభించాలి. అభినివేశం, అభిరుచిని అనుసరించి ప్రోత్సాహం అందాలి. బ్రాహ్మణుల్లో పౌరోహితులున్నారు. పారిశ్రామిక రంగంలో ఆసక్తి కలవారు, విద్య అభ్యసించే వారు, ఉపాధి కల్పన కోసం ప్రయత్నం చేసే వారున్నారు. వారందరికీ ఉపయోగపడేలా కార్యక్రమాలుండాలి
– హైదరాబాద్ లో నిర్మించే బ్రాహ్మణ సదనం బ్రాహ్మణ సమాజోధ్ధరణ వేదికగా మారాలి. వేరే ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, పండితులు వచ్చినా అక్కడ బస చేసే వీలు కల్పించాలి. ఆచార, సంప్రదాయాల పరిరక్షణతో పాటు బ్రాహ్మణుల అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు అక్కడి నుంచి జరగాలి. సదనం కోసం వెంటనే స్థల సేకరణ జరగాలి
– పౌరోహిత వృత్తి చేపట్టే వారికి పెండ్లి కూడా కాని పరిస్థితి రావడం బాధాకరం. వారి జీవన స్థితిగతులు మెరుగుపరిచే వ్యూహం రూపొందిస్తాం
– తెలంగాణ ఆర్థికంగా బాగుంది. ఆధ్యాత్మికంగా కూడా బాగుండాలి
– అర్చకులకు కూడా మంచి జీత భత్యాలు అందించడంతో పాటు వారి గౌరవం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో ఒక కమిటీ వేసి అధ్యయనం చేస్తాం
– బ్రాహ్మణుల అభివృద్ధి కోసం పనిచేసే ట్రస్టును ఏర్పాటు చేయడంతో పాటు, అందులోనే వివిధ విభాగాలను ఏర్పాటు చేయాలి
– ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పేద బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలి
– అన్నదానం సత్యనారాయణ, ఎస్.వి. రావు, గీతామూర్తి, భద్రకాళి శేషు, సాది కమలాకర్ శర్మ, ధన్వంతరి కమలాకర్ శర్మ, కొవెల సుప్రసన్నాచార్య, యాదాద్రి లక్ష్మి నర్సింహచార్యులు, జగన్మోహన్ శర్మ, సువర్ణ సులోచన మాట్లాడారు.
బ్రాహ్మణ సదనం కోసం అడ్ హక్ కమిటీ:
—————————————-
1. సువర్ణ సులోచన
2. గీతామూర్తి
3. తిగుళ్ల కృష్ణమూర్తి
4. రంగరాజన్
5. వ్యాకరణం నాగేశ్వర్ రావు
6. కెఆర్. నందన్
7. సిఎల్. రాజం
8. శివశంకర్
9. కెవి. రమణాచారి
ప్రత్యేక ఆహ్వానితులుః
———————–
1. అరవిందరావు
2. ఐవైఆర్. కృష్ణారావు
3. ధన్వంతరి కమలాకర్ శర్మ