శ్రీశైల దేవస్థానం: జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఈ రోజు క్షేత్రపరిధిలో పర్యటించి భద్రతా చర్యలను పరిశీలించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు, ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు, స్థానిక సీ.ఐ రవీంద్ర, దేవస్థాన పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.ఈ పరిశీలనలో దేవస్థానం టోల్ గేట్, సాక్షిగణపతి కూడలి, హఠకేశ్వరకూడలి మొదలైనవాటిని పరిశీలించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ రద్దీ సమయాలలో తొక్కిసలాటలను నివారించేందుకు చేపడుతున్న చర్యలు, వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణ, దేవస్థానం పరిధిలోని పార్కింగ్ ప్రదేశాలను మొదలైన అంశాల గురించి ఎస్పీ వారికి వివరించారు.తరువాత జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శ్రీశైలానికి వచ్చే ప్రతివాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఈ తనిఖీల కోసం ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
వాహనాల తనిఖీలకు అనుగుణంగా టోల్ గేట్ వద్దకు రెండు వరుసలలో వాహనాలు వచ్చే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని దేవస్థానానికి సూచించారు. అదేవిధంగా శ్రీశైలానికి వచ్చే వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని, క్షేత్రానికి వచ్చే వాహనాల సంఖ్యకు అనుగుణంగా వాహనాల తనిఖీలకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.హఠకేశ్వరం వద్దనే వాహనతనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కార్యనిర్వహణాధికారి కి సూచించారు.యాత్రికులకు అవసరమైన సమాచారం తెలిసేవిధంగా టోల్ గేట్ ప్రాంతములో మరిన్ని మార్గసూచికలను ఏర్పాటు చేయాలని కూడా జిల్లా ఎస్పీ సూచించారు.