శ్రీశైల దేవస్థానంలో విశేష పూజలు

*

 శ్రీశైల దేవస్థానం:  శ్రీశైల దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి. లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు 16 న  రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిగింది.ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి,  మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేసారు.అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు  షోడశోపచారపూజలు జరిపారు. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీలో వేంచేబు చేయించి పల్లకీ ఉత్సవం జరిపారు.

నందీశ్వరస్వామికి విశేషపూజ

లోక కల్యాణం కోసం త్రయోదశిని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిపింది.ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం వుంటుంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు చేసారు.

ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజికవర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు.

అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను చేసారు.ఆ తరువాత నందీశ్వరస్వామికి  పంచామృతాలతోనూ, ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షాదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం చేసారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం జరిగింది.

పురుష సూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో  ఈ విశేషాభిషేకాన్ని చేసారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలను చేసారు. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన సమర్పణ  జరిగింది.తగు జాగ్రత్తలతో అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ నందీశ్వరస్వామికి విశేషార్చనలు జరిపించారు.

print

Post Comment

You May Have Missed