శ్రీశైల దేవస్థానంలో గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభం

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో వినాయకచవితిని పురస్కరించుకొని లోకకల్యాణం కోసం 9 రోజులపాటు జరిపే గణపతి నవరాత్రోత్సవాలు 22 న ప్రారంభం అయ్యాయి.ఈ నవరాత్రోత్సవాలలో 9 రోజులపాటు ఆలయప్రాంగణంలోని రత్నగర్భగణపతిస్వామివారికి, సాక్షిగణపతి ఆలయంలోని స్వామివారికి, సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన మృత్తికాగణపతి స్వామివారికి, యాగశాలలో వేంచేపు చేయించిన కాంస్యగణపతి మూర్తికి విశేషంగా పూజాదికాలు నిర్వహిస్తారు.

లోకకల్యాణం కోసం సంకల్పం:

ఈ ఉత్సవాలలో ముందుగా అర్చకస్వాములు లోకక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. ఈ సంకల్పంలో దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని సంకల్పములో పేర్కొన్నారు.

ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని హాని కలిగించే కరోనా వైరస్ నివారణ జరిగి , ప్రస్తుత విపత్కర పరిస్థితులు తొలగిపోయి, జనులందరికీ సుఖశాంతులు కలగాలని అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు.

| రత్నగర్భగణపతికి ప్రత్యేక పూజలు |

గణపతి నవరాత్రోత్సవాలలో భాగంగానే  ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భగణపతి స్వామివారికి విశేషంగా అభిషేకం, అర్చనలు జరిగాయి. ఉత్సవసమయంలో ప్రతిరోజు కూడా ఈ విశేష కార్యక్రమాలు ఉంటాయి.

యాగశాలలో కార్యక్రమాలు గణపతి నవరాత్రోత్సవాలలో భాగంగా స్వామివారి యాగశాలలో ఉత్సవ సంబంధి కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిపారు. ఈ కార్యక్రమాలలో ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని ముందుగా మహాగణపతి పూజ చేసారు. అనంతరం కంకణపూజ, కంకణధారణ, ఋత్విగ్వరణం మొదలైన కార్యక్రమాలు , పూజానంతరం జరిగిన కంకణధారణ కార్యక్రమంలో ఆలయ అర్చకస్వాములు, అధికారులు సమంత్రకంగా కంకణాలు ధరించారు. తరువాత జరిగిన ఋత్విగ్వరణ కార్యక్రమంలో ఆయా ఉత్సవాంగ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి  మూల మంత్రజపం, హవన నిర్వహణ మొదలైన వాటిని నిర్వహించే అర్చక, వేదపండితులను సమంత్రకంగా ఆహ్వానించి దీక్షవస్త్రాలను అందించారు.

తరువాత యాగశాలలో  పంచలోహ గణేశమూర్తికి విశేషపూజలు జరిపారు.

ఈ ఉత్సవాలలో భాగంగానే ఈ సాయంత్రం 5.30 గంటల నుండి అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, సాయంకాల హవనాలు, గణపతి హోమం జరిగాయి.

 ఈ ఉత్సవాలలో ప్రతిరోజు కూడా రత్నగర్భగణపతిస్వామివారికి, యాగశాలలో వేంచేపు చేసిన పంచలోహ గణపతిమూర్తికి, సాక్షిగణపతిస్వామివారికి, ఉత్సవాల సందర్భంగా  మృత్తికా గణపతికి విశేష పూజలు వుంటాయి.

ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ యాగశాలలో మండపారాధనలు, జపానుష్ఠానాలు, గణపతిహోమం, పారాయణలు, సాయంకాల హవనములు నిర్వహిస్తారు.

కాగా ఉత్సవాల చివరి రోజైన 31వ తేదీన ఉదయం జరిగే పూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృథకార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

| సాక్షిగణపతిస్వామివారికి ప్రత్యేక పూజలు:

నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ఈ ఉదయం సాక్షిగణపతి స్వామివారికి ప్రత్యేక అభిషేకం, విశేష అర్చనలు జరిగాయి. పంచామృతాలతోనూ, ఫలోదకాలతోనూ, శుద్ధజలంతోనూ ఎంతో శాస్తోక్తంగా ఈ అభిషేకాన్ని నిర్వహించారు. ఉత్సవరోజులలో ప్రతిరోజూ కూడా విశేషపూజలను వుంటాయి.

| మృత్తికా గణపతికి ప్రత్యేకపూజలు :

గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా సాక్షిగణపతి ఆలయంలో ప్రత్యేకంగా మృత్తికాగణపతిని నెలకొల్పారు. ఈ ఉదయం సాక్షిగణపతి స్వామివారికి పూజాదికాలు ముగిసిన వెంటనే వ్రతవిధానంలో ఈ మృత్తికా గణపతి వారికి విశేషంగా పూజాదికాలు జరిపారు. ఉత్సవాలలో ప్రతిరోజు కూడా మృత్తికా గణపతి వారికి విశేష అభిషేకాలు జరిగాయి.

print

Post Comment

You May Have Missed