శ్రీశైల దేవస్థానంలో ఏప్రిల్ 3 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు జరిగే ఉగాది మహోత్సవాల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దేవస్థానం ఈ ఓ. ఎ. శ్రీరామచంద్ర మూర్తి ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. బీజాపూర్ సిద్దేశ్వర ఆలయ సమావేశ మందిరంలో శనివారం సమన్వయ సమావేశం జరిగింది.కర్ణాటక, మహారాష్ట్ర భక్త బృందాలు , శ్రీశైలం దేవస్థానం ప్రతినిధులు పాల్గొన్నారు. ఉగాది ఉత్సవాల ఏర్పాట్లపై ఈ ఓ తీసుకుంటున్న చర్యల గురించి దేవస్థానం ప్రతినిధులు ఈ సమావేశంలో వివరించారు.
ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడు మనకు అతిథిగా భావించాలని, ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ ఓ ఆశయాన్ని ప్రతినిధులు వివరించారు.దేవస్థానం చేస్తున్న విస్తృత ఏర్పాట్లను తెలిపారు.తాత్కాలిక వసతి , మంచినీటి సదుపాయం తదితర సౌకర్యాలను వివరించారు.సౌకర్యవంతమైన దర్శనానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యూ లైన్లలో మంచినీరు, అల్పాహారం ఇస్తారన్నారు. అనేకమంది దర్శనానికి వస్తున్నందున పారిశుధ్య పనులపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 4, 5, 6 తేదీలలో మూడు రోజులపాటు శ్రీ స్వామి వార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం ఉంటుందని , అంతా సహకరించాలని అధికార బృందం వారు కోరారు.నాగలూటి ,పెచ్చెర్వు,కైలాస ద్వారం వద్ద , క్షేత్ర పరిధిలోని పలు చోట్ల అన్న ప్రసాద వితరణ చేసే భక్త బృందాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ బృందాలు ముందుగా దేవస్థానం వారిని సంప్రదించాలని వివరించారు.
ఈ సమావేశంలో దేవస్థానం సహాయ అభియంత కె .వి .ఎస్. రామిరెడ్డి. సహాయ కార్యనిర్వహణాధికారి సి.రాజశేఖర్, సంపాదకులు డా.అనిల్ కుమార్,శ్రీ స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు ఎం.మల్లికార్జున స్వామి , అమ్మ వారి ఆలయ ప్రధాన అర్చకులు పి. మార్కండేయులు, అర్చకులు హెచ్.వీరయ్య స్వామి, బీజాపూర్,భాగల్ కోట్ ,బీదర్ , గుల్బర్గ , యాదగిరి, రాయచూర్, బెల్గాం జిల్లాల భక్త బృందాలు, షోలాపూర్,సాంగ్లి ప్రాంతాలకు చెందిన 20 కి పైగా భక్త బృందాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దేవస్థానం పాలక మండలి సభ్యులు గిరీష్ ఎం. పాటీల్ ప్రసంగించి పలు సూచనలు చేసారు.