శృంగేరి శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విదుశేఖర భారతి స్వామి వారు సోమవారం శ్రీశైలం విచ్చేశారు . విజయయాత్రలో భాగంగా స్వామి వారు శ్రీశైలం చేరుకున్నారు . ముందుగా స్వామి వారు సాక్షి గణపతి ఆలయం వద్ద పూజాదికాలు నిర్వహించారు . అనంతరం శ్రీశైలం టోల్ గేట్ వద్ద శ్రీ స్వామి వారి ఆలయం ప్రధాన అర్చకులు శ్రీపీఠంమల్లికార్జున స్వామి , వేద పండితులు శ్రీ ఘంటి రాధాకృష్ణ శర్మ అవధాని , సహాయ కమిషనర్ బి. మహేశ్వర రెడ్డి , ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎస్.వి .కృష్ణా రెడ్డి ,వసతి విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.యన్ . వి. మోహన్ ,ప్రజా సంబంధాల అధికారి శ్రీనివాస రావు , పలువురు అర్చక స్వాములు , వేదపండితులు ,సిబ్బంది , స్థానికులు స్వామి వారికి ఘన స్వాగతం పలికారు . స్వామి వారు టోల్ గేట్ నుంచి శోభాయాత్రతో స్థానిక శృంగేరి మఠం చేరుకున్నారు . మఠం ప్రాంగణంలో స్వాగత సభ జరిగింది . ఈ కార్యక్రమంలో దేవస్థానం తరఫున ప్రధాన అర్చకులు , వేదం పండితులు జగద్గురువుల వారికి స్వాగత సమర్పణ చేసారు .
స్వాగత సభలో జగద్గురువుల వారు అనుగ్రహ భాషణం చేసారు . శ్రీశైలం క్షేత్ర మహిమా విశేషాలను వారు వివరించారు .శ్రీశైల క్షేత్ర నామంలోనే క్షేత్రం గొప్పతనం ఇమిడి ఉందన్నారు . శ్రీ అనే గౌరవ వాచకంతో నామం ప్రారంభం కావడం గొప్ప విశేషమన్నారు . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తమ మొట్టమొదటి విజయయాత్ర శ్రీశైల క్షేత్రం నుంచి ప్రారంభం కావడం ఆనందం కలిగించిదన్నారు . ఈ గొప్ప అవకాశం తమ గురుదేవులైన శృంగేరిపీఠం అధిపతులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి అనుగ్రహంతోనే లభించిందన్నారు .స్వామి వారు శివతత్వాన్ని వివరించారు .శ్రీశైలక్షేత్ర ఆదిదేవులైన శ్రీ భ్రమరామ్బా మల్లికార్జున స్వామి వార్లు అందరిని సదా రక్షిస్తూ ఉంటారని ఆశీర్వదించారు . ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ అధ్యక్షులు ఆనంద్ సూర్య పాల్గొన్నారు . ఈ కార్యక్రమం గొప్ప ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది .