
అనంతరం శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల తెలుగు అధ్యయన విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో స్మారకోపన్యాస సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య మురళీధర శర్మ మాట్లాడుతూ తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి ప్రభాకరశాస్త్రి కృషి చేశారని చెప్పారు. ఉన్నతమైన సాహితీ విలువలను, తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు. ఆయన పద్య సాహిత్యంతోపాటు కథలు, కథానికలు కూడా రచించారని వివరించారు.
టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు విశ్రాంత ప్రత్యేకాధికారి డా. సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ ఆంధ్ర వాఙ్మయ విస్తృతికి వేటూరి వారు ఎంతో కృషి చేశారని, గ్రంథ విమర్శనలో ఆయనకు మరెవరూ సాటి రారని చెప్పారు. తాను 8 శ్లోకాలతో రచించిన ప్రభాకర అష్టకంలో వారి వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఆవిష్కరించానని, విద్యార్థులు దీన్ని చదవాలని కోరారు. వేటూరి వారు రచించిన 58 గ్రంథాలు లభించాయని, ఇంకా కొన్ని లభించాల్సి ఉందని తెలిపారు.
టిటిడి ముఖ్య అంకణీయ అధికారి కె.శేషశైలేంద్ర మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్య రంగాల్లో విస్తృతంగా పరిశోధన చేసి వేటూరి ప్రభాకరశాస్త్రి తన ఉనికిని చాటారని చెప్పారు. తన రచనలతో సమాజాన్ని ఎంతగానో చైతన్యపరిచారని తెలిపారు. ఎన్నో పురాతన గ్రంథాలను పరిష్కరించి టిటిడికి అందజేశారని వివరించారు. విద్యార్థులు ఇలాంటి సదస్సులను సద్వినియోగం చేసుకుని పరిశోధనాంశాలుగా మార్చుకోవాలని సూచించారు.
ఎస్వీయూ సంస్కృత విభాగాధ్యక్షులు ఆచార్య జి.పద్మనాభం మాట్లాడుతూ ప్రభాకర శాస్త్రి కృషి వల్లనే ఎస్వీ వర్సిటీలోని ప్రాచ్య పరిశోధన సంస్థలో ప్రస్తుతం దాదాపు 40 వేల గ్రంథాలు ఉన్నాయని తెలిపారు. పురాతన తాళపత్రాలను చాలా వరకు పరిష్కరించి గ్రంథ ముద్రణ చేశారని చెప్పారు. వేటూరి వారి లక్షణాలను అందిపుచ్చుకుని విద్యార్థులు జీవితంలో రాణించాలని కోరారు.
సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ బానోత్ సురేందర్ మాట్లాడుతూ వేటూరి ప్రభాకర శాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, వారి జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా స్మారకోపన్యాస సభలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 1939వ సంవత్సరంలో వీరు ప్రాచ్య కళాశాలలో తెలుగు అధ్యయన విభాగాన్ని ప్రారంభించారని తెలిపారు. అన్నమయ్య జయంతి ఉత్సవాలకు కూడా వీరు నాంది పలికారని వివరించారు. వేటూరి వారి సాహిత్యాన్ని ప్రజలకు అందించేందుకు 2007లో టిటిడి వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. అనంతరం పలు అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
వేటూరి విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
ఉదయం తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా ప్రభాకరశాస్త్రి విగ్రహానికి టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు విశ్రాంత ప్రత్యేకాధికారి డా|| సముద్రాల లక్ష్మణయ్య, ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్ బానోత్ సురేందర్, ఎస్వీ వేద వర్సిటీ రిజిస్టార్ రామచంద్ర తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల గ్రంథాలయాధికారి జాటోత్ భాస్కర్, ఇతర అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.