వాషింగ్టన్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూలస్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. అదే విధంగా భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు అరుణీశ్ చావ్లా(ఐఏఎస్), నీల్కాంత్ అవ్హద్(ఐఏఎస్) కూడా సీఎం జగన్ను సాదరంగా ఆహ్వానించారు. వందలాదిగా తరలివచ్చిన ఎన్నారైలతో ఎయిర్పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచి అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అనంతరం భారత రాయబారి ఆహ్వానం మేరకు సీఎం జగన్ విందులో పాల్గొంటారు.