*ఆర్థిక, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి*
హైదరాబాద్ ః ఉద్యోగుల సమస్యలపై సర్కార్ సానుకూలంగా ఉందని, ఆయా సమస్యలు-వాటి పరిష్కారాల విషయమై సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళతామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలతోపాటు వైద్య ఆరోగ్యశాఖలోని సమస్యలన్నింటిపైనా మంత్రి శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిశీలిస్తున్నామన్నారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి సమస్యలపై చర్చించామన్నారు. ఆయా ఉద్యోగులు పేర్కొంటున్న సమస్యల్లో చాలా వరకు ఇప్పటికే పరిష్కారమయ్యాయని, అందులో కొన్ని ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పారు.
ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల హెల్త్ స్కీంని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన నిధులు ఉన్నాయన్నారు. ఇప్పటికే వెల్‌నెస్ సెంటర్ల పనితీరుని మెరుగు పరచడానికి ఇద్దరు అధికారులను నియమించామన్నారు. వెల్ నెస్ సెంటర్లలో తలెత్తే సమస్యల మీద ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు, సుధాకర్ రావు (సెల్ ఫోన్ నెంబర్ః 9676552169), విజయ్ (సెల్ ఫోన్ నెంబర్లు ః 9949015009, 8978910902)లను సంప్రదించాలన్నారు.
వెల్ నెస్ సెంటర్లలో మందుల కొరతని సాధ్యమైన మేర నివారించగలిగామన్నారు. అత్యవసర మందులు, ఇతర సేవల కోసం వెల్ నెస్ సెంటర్లకు ప్రత్యేకంగా నిధులు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు వారి కటుంబాలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మంచి మెరుగైన సేవలు అందించడానికి వెల్ నెస్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. గతంలో చెప్పిన విధంగా మిగతా వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ట్రెజరరీ వేతనాలు, హెల్త్ కార్డులపై కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఉందన్నారు. ఉద్యోగుల డిమాండ్లలో కొన్ని విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఇలాంటి నిర్ణయాలు జరగాలంటే వాటిని సీఎం దృష్టికి తీసుకె్ళ్ళాల్సి ఉందన్నారు.
కొత్తగా నెలకొల్పనున్న 17 మాతా శిశు వైద్యశాలలకు అవసమైన నిధులు మంజూరు విషయమై కూడా మంత్రి ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో చర్చించారు. నిధులు త్వరలో సమకూరిస్తే, ఆయా మాతాశిశు వైద్యశాలల భవనాల నిర్మాణాలను మొదలుపెడతామన్నారు.
మహబూబ్‌నగర్ తరహాలోనే, అనుమతులు లభించిన సిద్దిపేట మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా మెడకిల్ కాలేజీ ప్రారంభమయ్యే విధంగా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. త్వరలోనే సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీల మేరకు నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి అధికారులకు చెప్పారు.ఎయిమ్స్ ఏర్పాటుకు అనుమతి లభించిందని, అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశమై స్థలాల పరిశీలన జరుగుతున్నదన్నారు. అందుబాటులో ఉన్న స్థలాల వివరాలతో త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, అధికారులతో సమావేశమవుతామని చెప్పారు. వేగంగా సాధ్యమైనంత తొందరలోనే ఎయిమ్స్ పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తామన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆరోగ్యశ్రీ సిఇఓ మాణిక్ రాజ్, అసిస్టెంట్ సెక్రటరీ సోనీ బాలా దేవి, డిప్యూటీ సెక్రటరీ సునీత, డిఎంఇ డాక్టర్ రమేశ్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజారెడ్డి, టివివిపి కమిషనర్ డాక్టర్ శివ ప్రసాద్, గోపీకాంత్‌రెడ్డి తదితరుల పాల్గొన్నారు.
Post Comment