మైండ్‌స్పేస్ ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించిన సి.ఎస్‌.జోషి

*రికార్డు యంలో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తిపై అభినంద‌*

వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ది కార్య‌క్ర‌మంలో భాగంగా మైండ్ స్పేస్ జంక్ష‌న్ ఫ్లైఓవ‌ర్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్‌.కె.జోషి నేడు ప్రారంభించారు. ప్ర‌భుత్వ మున్సిప‌ల్ ప‌రిపాల‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్‌, సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వి.సి.స‌జ్జ‌నార్‌, శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ హ‌రిచంద‌న‌లు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. చీఫ్ సెక్ర‌ట‌రీ ఎస్‌.కె.జోషి మాట్లాడుతూ రికార్డు స‌మ‌యంలో ఈ ఫ్లైఓవ‌ర్ నిర్మాణాన్ని పూర్తిచేసి న‌గ‌ర‌వాసుల‌కు అందుబాటులోకి తేవ‌డం ప‌ట్ల జీహెచ్ఎంసీ అధికారుల‌ను అభినందించారు. ట్రాఫిక్‌కు అంత‌రాయం లేకుండా ఎస్‌.ఆర్‌.డి.పిలో భాగంగా నిర్మిస్తున్న ప‌లు ప్రాజెక్ట్ ప‌నులు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉన్నాయ‌ని అభినందించారు. రూ. 108.59 కోట్ల వ్య‌యంతో మైండ్ స్పేస్ జంక్ష‌న్ అభివృద్ది ప‌నులు చేప‌ట్టారు. నిత్యం ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ఎదుర్కొనే ఐటి కారిడార్‌ ఉద్యోగుల‌కు నేడు చీఫ్ సెక్ర‌ట‌రీ ప్రారంభించిన ఈ ఫ్లైఓవ‌ర్ ద్వారా ఐటి కారిడార్‌లో ట్రాఫిక్ ఇబ్బందుల‌కు త‌గ్గే అవ‌కాశం ఏర్ప‌డింది. 850 మీట‌ర్ల పొడ‌వు ఉన్న ఈ ఫ్లైఓవ‌ర్ ద్వారా సైబ‌ర్ ట‌వ‌ర్ నుండి బ‌యోడైవ‌ర్సిటీ వైపు, ఇనార్బిట్ మాల్ నుండి రాడిస‌న్ వైపు వెళ్లే వాహ‌నదారులు మ‌రింత సుల‌భ‌తర ప్ర‌యాణం జ‌రిపే అవ‌కాశం ఏర్పడింది. 2016 ఏప్రిల్ 2న ప్రారంభించిన ఈ ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నులు ల‌క్ష్యానిక‌న్నా ముందుగానే నిర్మాణం పూర్తిచేశారు. ఈ మైండ్ స్పేస్ జంక్ష‌న్‌లో రూ. 108.59 కోట్లతో చేప‌ట్టిన జంక్ష‌న్ అభివృద్ది ప‌నుల్లో భాగంగా రూ. 48.06 కోట్ల నాలుగు లేన్ల బై డైరెక్ష‌న‌ల్ ఫ్లైఓవ‌ర్‌, రూ. 25.78 కోట్ల‌తో ఆరు లేన్ల బై డైరెక్ష‌న‌ల్ అండ‌ర్ పాస్‌, రూ. 28.83 కోట్ల‌తో స‌ర్వీస్ రోడ్‌, యుటిలిటి డ‌క్ట్‌, డ్రెయిన్లు, రూ. 5.92 కోట్ల‌తో మౌలిక స‌దుపాయాలు అయిన వాట‌ర్ డ్రైనేజీ, అండ‌ర్ గ్రౌండ్ కేబుళ్ల డ‌క్ట్‌ల నిర్మాణం చేప‌ట్టారు. ఈ ఫ్లైఓవ‌ర్‌కు 84 పి.ఎస్‌.సి గ్రేడ‌ర్లు, 42 కంపోసిట్ గ్రేడ‌ర్లు నిర్మించారు. ప్ర‌స్తుతం ఈ మార్గంలో గంట‌కు 14వేల‌కు పైగా వాహ‌నాలు ప్ర‌యాణిస్తుండ‌గా 2035 నాటికి వీటి సంఖ్య 31,500ల‌కు పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశారు. కాగా ఎస్‌.ఆర్‌.డి.పిలో భాగంగా మొద‌టి ద‌శ‌లో చేప‌ట్టిన ప‌లు ప్రాజెక్ట్‌ల‌లో ఇప్ప‌టికే అయ్య‌ప్ప సొసైటి, ఎల్బీన‌గ‌ర్ చింత‌ల్‌కుంట‌, మైండ్‌స్పేస్ ప్రాంతాల్లో అండ‌ర్‌పాస్‌ల‌ను న‌గ‌ర‌వాసుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. ఎల్బీన‌గ‌ర్ కామినేని వ‌ద్ద ఫ్లైఓవ‌ర్‌ను కూడా ప్రారంభించారు.  రాజీవ్‌గాంధీ, జె.ఎన్‌.టి.యు ఫ్లైఓవ‌ర్ల‌ను జ‌న‌వ‌రి మాసంలో ప్రారంభించ‌నున్న‌ట్టు చీఫ్ ఇంజ‌నీర్ శ్రీ‌ధ‌ర్ తెలిపారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.