
*హరిత హారంలో పాల్గొన్న బ్రిటీష్ దౌత్యవేత్తలు
తెలంగాణ హరిత హారంలో పాలుపంచుకున్నారు బ్రిటీష్ దౌత్యవేత్తలు. బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం పరిధిలోని డిచ్పల్లి మండలం ధర్మారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో న్యూడిల్లీ నుంచి వచ్చిన బ్రిటీష్ దౌత్యవేత్తలు మొక్కలు నాటారు. బ్రిటీశ్ హై కమిషన్ రాజకీయ, మిడియా విభాగాధిపతి కీరన్ డ్రేక్, తెలంగాణ, ఏపి రాష్ట్రాల డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్‌లు నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటన సందర్భంగా ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం స్కూల్ విద్యార్థినులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.
స్కూల్ వైస్ కేప్టెన్ నీరజ మాట్లాడుతూ యూకెలో తనకు చదవుకోవాలని ఉందని, అక్కడి విద్యా విధానం గురించి అడిగారు. స్పందించిన ఆండ్రూ ఫ్లెమింగ్ 12వ తరగతి వరకు తమ దేశఃలో నిర్భంధ విద్య ఉంటుందని, పై చదువులకు యూనివర్శిటీల్లో చేరుతారని చెప్పారు. ప్రపంచంలోని టాప్ టెన్ వర్శిటీల్లో నాలుగు వర్శిటీలు యూకెలో ఉన్నాయని తెలిపారు. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపుతారని, వారికి వంద శాతం ఉచితంగా అడ్మిషన్, బోధన, వసతి కల్పిస్తామని ఆండ్రూ వివరించారు.
స్కూల్ కల్చరల్ సెక్రెటరీ మయూరి మాట్లాడుతూ మీ భాష యాస బాగుందని, తనకూ అలాంటి యాసలో మాట్లాడాలని ఉందని తన కోరికను వెల్లడించారు. అలాగే అక్కడి కల్చర్ గురించి కూడా అడిగారు. తెలంగాణలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించారని ఆండ్రూ ఫ్లెమింగ్ చెప్తూ..పట్టుదల ఉంటే ఏదయినా సాధించవచ్చన్నారు.
గ్లోబల్ వార్మింగ్ పెద్ద సమస్యగా మారిందని, యూకెలో క్లయిమేట్ ఛేంజ్ కోసం అవంలంభిస్తున్న విధానాలు ఏమిటని ఆశ్రమ పాఠశాల వైస్ కెప్టెన్ శివాని ప్రశ్నించారు. దౌత్యవేత్త ఆండ్రూ ఫ్లెమింగ్ సమాధానమిస్తూ, వాతావరణ మార్పుల ప్రభావానికి గురయ్యే దేశాల్లో యూకె ఒకటన్నారు. దీవుల సమూహం అయిన యూకె కు గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రమాదం ఉందన్నారు. అంతర్జాతీయంగా గ్లోబల్ వార్మింగ్‌పై అవగాహన కల్పిస్తూ, నివారణకు నిధులను సమకూర్చుతున్నదని వివరించారు.
గ్రీన్ గార్డ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రీన్ గార్డ్ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు బ్రిటీష్ హై కమిషన్ రాజకీయ, మీడియా విభాగాధిపతి కీరన్ డ్రేక్ తెలిపారు. పట్టుదలతో చదివితే మాలాగా ఐఎఫ్ ఎస్ ఆఫీసర్ లు కావచ్చన్నారు. తెలంగాణకు అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. హరిత హారంలో పాల్గొనడం, విద్యార్థినిలతో చర్చాగోష్టిలో పాల్గొనే అవకాశం కల్పించిన నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు చెప్తున్నానన్నారు.
అంతకు ముందు బ్రిటీష్ దౌత్యేవేత్తలు డిచ్పల్లి ఖిలా రామాలయం సందర్శించారు. పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శనం చేసుకున్న తరవాత ఆలయ విశిష్టతను పూజారులు వివరించారు. ఆలయం శిల్పకళా సౌందర్భానికి ముగ్ధులయ్యారు. స్థానికులను ఉద్దేశించి ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ భారతీయ శిల్ప కళా వారసత్వ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఇలాంటి వారసత్వ, చారిత్రక ప్రదేశాలను కాపాడేందుకు తమవంతు సహకారం అందిస్తామని అన్నారు. ఖిలా రామాలయం పర్యాటక ప్రదేశంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. స్థానికులు ఈ దిశంగా ప్రయత్నాలు ప్రారంభించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావు, బాజిరెడ్డి జగన్, యూకె జాగృతి అధ్యక్షులు సుమన్ రావు బల్మూరి, సభ్యులు నితీశ్, ప్రశాంత్ పూస, దినేశ్, సృజన్ పాల్గొన్నారు