బలహీనవర్గాల అభివృద్ధికి బంగారు బాటలు వేసేందుకు బీసీ కమిషన్ పనిచేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. మంత్రి ఈటలను బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరి గౌరిశంకర్, అంజనేయగౌడ్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన మంత్రికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి రాజేందర్ వారిని అభినందించారు.
ఏరికోరి నిష్ణాతులైన వ్యక్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారని ఈటల రాజేందర్ అన్నారు. బలహీనవర్గాలను విద్య, ఉద్యోగం, సామాజికంగా సమానస్థాయిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కమిషన్ పనిచేయబోతుందని ఆయన చెప్పారు.
బీసీల్లో కులాల వారీగా ఉన్న సమస్యలు, వెనుకబాటుతనం, విద్య-ఉపాధి అవకాశాలు, ఆచార వ్యవహారాలపై సమగ్రమైన రిపోర్టును కమిషన్ తయారు చేయనుంది. బీసీల్లో ఉన్న చాలా కులాలు ఎస్సీ, ఎస్టీల కంటే కూడా వెనుకబడి ఉన్నాయి. రిజర్వేషన్ ఫలాలను మిగతా వారితో పోటీపడి అందుకోలేక పోతున్నాయి. అటువంటి కులాలను గుర్తించి వారికి ప్రభుత్వ ఫలాలు, రిజర్వేషన్ ఫలితాలు అందించడమే కమిషన్ లక్ష్యం. ఇందుకోసం సభ్యులంతా చిత్తశుద్ధిగా పనిచేయాలని మంత్రి కోరారు.
కేసీఆర్ ప్రభుత్వం బలహీనవర్గాలకు చేదోడు వాదోడుగా నిలిచే ప్రభుత్వమని, కళ్యాణలక్ష్మీ లాంటి పథకాలను బీసీలకు కూడా వర్తింపజేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని ఈటల అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో సైతం రిజర్వేషన్ కల్పించామన్నారు. విద్య ద్వారానే వెనుకబాటుతనం పోతుందని ప్రభుత్వ నమ్మకం, అందుకే నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 రెసిడెన్షియల్ స్కూళ్ళను ప్రారంభించబోతున్నాం అన్నారు. సంక్షేమంలో తెలంగాణానే నంబర్ వన్ గా ఉందని ఈటల రాజేందర్ చెప్పారు.