శ్రీశైల దేవస్థానం: ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం కలగకుండా పంచమఠాల పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని శ్రీశైల దేవస్థానం ఈఓ తెలిపారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధి పనులలో భాగంగా దేవస్థానం చేపట్టిన పంచమఠాల పునర్నిర్మాణ పనులను ఈ రోజు కార్యనిర్వహణాధికారి, రాష్ట్ర దేవదాయశాఖ విశ్రాంత స్థపతి ఎస్. సుందర రాజన్తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. పంచమఠాలలో విభూతిమఠ పునర్నిర్మాణ పనులు దాదాపు 80శాతం పూర్తికాగా, రుద్రాక్షమఠ పునర్నిర్మాణ పనులు 90శాతం దాకా పూర్తి అయ్యాయని ,అదేవిధంగా ఘంటామఠం పనులు దాదాపు 50శాతం దాకా పూర్తి అయ్యాయని వివరించారు.
పంచమఠాలను భక్తులందరు ఒకేసారి దర్శించుకునేందుకు వీలుగా అన్నిమఠాలను కలుపుతూ (ఒకే సర్కూట్ గా) ఏక రహదారిని నిర్మించేందుకు వీలుగా వెంటనే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పంచమఠాలలో ఆకర్షణీయమైన లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని వివరించారు.
ఈ సందర్భంగా సుందరరాజన్ పలు సూచనలు అందజేశారు.పంచమఠాల పరిసరాలను ఆహ్లాకరంగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా ప్రహరిగోడలను ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రాచీన నిర్మాణశైలి స్పష్టంగా కనిపించే విధంగా లైటింగ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ పరిశీలనలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి. మురళీ బాలకృష్ణ, సహాయ స్థపతి ఐ.యు.వి. జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.
*Uyala seva and Ankaalamma special puja performed in the tempe on this day.