కోవిడ్ – 19 కేంద్ర బృంద ప్రతినిధులు డా. మధుమిత దూబే, డైరెక్టర్, ప్రొఫెసర్, ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైజిన్ అండ్ పబ్లిక్ హెల్త్, , డా. సంజయ్ కుమార్ సాదూఖాన్, ప్రొఫెసర్, ఆలిండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ హైజిన్ అండ్ పబ్లిక్ హెల్త్ వారు ఈ రోజు శ్రీశైలంలో పర్యటించారు. శ్రీశైలక్షేత్రములో కోవిడ్ నివారణకు తీసుకున్న చర్యలు, ,భవిష్యత్తులో భక్తులను దర్శనానికి అనుమతించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైన వాటిని గురించి పరిశీలించేందుకు ఈ కేంద్ర బృందం శ్రీశైలానికి వచ్చింది. ఈ ఉదయం బృంద ప్రతినిధులు దర్శనం క్యూలైన్లు, ఆలయ మాడవీధులు మొదలైన వాటిని పరిశీలించారు.
భవిష్యత్తులో ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి భక్తులను దర్శనాలకు అనుమతించేటప్పుడు దేవస్థానం తీసుకోనున్న ముందస్తు జాగ్రత్తల గురించి కార్యనిర్వహణాధికారి వారికి వివరించారు.
రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ వారి సూచనల మేరకు దేవస్థానం పలు ముందస్తు చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా క్యూలైన్ల ప్రవేశం వద్ద కరోనా వ్యాధి నిరోధక ద్వారాలు (Disinfection Tunnels) ఏర్పాట్లు అవుతున్నాయి. క్యూలైన్లలో భౌతిక దూరాన్ని పాటింపజేసేందుకు వృత్తాలు ఏర్పాటు ఆవుతున్నాయి.
కేంద్ర బృంద ప్రతినిధులు క్యూలైన్లలో ఏర్పాటుఅయిన వృత్తాలను, సూక్ష్మక్రిమి నిరోధక ద్వారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తలను దర్శనాలకు అనుమతించేటప్పుడు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా క్యూలైన్లలో భక్తులు భౌతికదూరం పాటించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. క్యూలైన్లలో ప్రవేశించేటప్పుడు విధిగా చేతులను శుభ్రపరుచుకునేందుకు అవసరమైన తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, దర్శనాలకు విచ్చేసే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ లాక్ డౌనకు ముందు , లాక్ డౌన్ ప్రకటించిన తరువాత దేవస్థానం చేపట్టిన చర్యలపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఇదేవిధంగానే భవిష్యత్తులో భక్తులను దర్శనాన్ని అనుమతించేటప్పుడు కూడా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తరువాత కేంద్రబృంద ప్రతినిధులు భ్రమరాంబా అతిథిగృహములోని సమావేశమందిరములో స్థానిక వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేస్తూ ప్రజలు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.