Minister KTR reviewing the impact of rains in municipalities, with Municipal Commissioners in State, over a video conference from Secretariat.
పురపాలికల్లో వర్షాలపైన పురపాలక శాఖ మంత్రి శ్రీ కెటి. రామారావు సమీక్ష
• వేంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
• పురపాలికల్లోని చెరువులు, నాలలపైనున్న అక్రమ కట్టడాలను కూల్చేయాలి
• చెరువులు, నాలాల సమాచారం సేకరించి డిజిటలైజ్ చేయాలి
• ఇందుకోసం రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులతో జాయింట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు
• పురపాలికల్లోని శిథిలావస్థలోని భవనాలను వేంటనే గుర్తించి, కూల్చేయాలి
• ప్రాణనష్టం జరిగితే మున్సిపల్ కమీషనర్లనే భాద్యులు
• మున్సిపల్ కమీషనర్ల పనితీరుపైన మంత్రి అసంతృప్తి, ఆగ్రహాం
• కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
• అన్ని మున్సిపాలిటీల్లో విడియో కాన్ఫరెన్సు సౌకర్యాన్ని వారంలోగా ఏర్పాటు చేయాలని ఆదేశం
రాష్ట్రంలో పురపాలికల్లో కురుస్తున్న వర్షాలపైన పురపాలక శాఖ మంత్రి కెటి. రామారావు సమీక్షించారు. ఈ రోజు సచివాలయం నుండి అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయితీల మున్సిపల్ కమీషనర్లతో మంత్రి విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. తెలంగాణలో గత కొన్ని సంవత్సరాల్లో ఏప్పుడు లేని విధంగా అధిక వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల అనంతరం ఆరోగ్య సమస్యలు రాకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాడయిన రోడ్లను, ఇతర మౌళిక వసతులను వేంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. పట్టాణాల్లోకి వరదలు వచ్చేందుకు దారితీసిన కారణాలను గుర్తించాలన్నారు. ప్రతి పురపాలికలోని జలవనరులు, చెరువుల గురించి పూర్తి సమాచారం సేకరించి డిజిటలైజ్ చేయాలన్నారు. ప్రతి చెరువు, నాలాల మ్యాపులను సేకరించలన్నారు. వీటిపైన ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించాలన్నారు. చట్ట విరుద్ధంగా నాలాలను కబ్జా చేసిన వారెవరైనా, వదలకుండా కట్టడాలను కూల్చి వేయాలన్నారు. ఈ కూల్చివేతల సందర్భంగా పేదవారిని టార్గెట్ చేయకుండా ముందుగా కమర్షియల్ అవసరాల కోసం కట్టిన వాటిని వేంటనే కూల్చేయాలన్నారు. అర్హులైన పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇక నాలాలు కుంచించుకుపోయిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా చర్యలు తీసుకుని వాటిని వెడల్పు చేయ్యాలన్నారు. ఇందుకోసం రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులతో జాయింట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పురపాలికల్లోని శిథిలావస్థలోని భవనాలను వేంటనే గుర్తించి, కూల్చేయాలన్నారు. వర్షాల వల్ల ఏలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. ఒక వేళ ఇలాంటి భవనాల వలన ప్రాణనష్టం జరిగితే మున్సిపల్ కమిషనర్లనే భాద్యులను చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ల పనితీరుపైన మంత్రి అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుసార్లు చెప్పినా కొంత మంది విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని, అలాంటి వారిపైన వారంలోగా చర్యలుంటాయన్నారు. ఇదే చివరి అవకాశమని, ప్రభుత్వ ఆదేశాలను, మున్సిపల్ యాక్ట్ ప్రకారం తమ విధులను నిర్వహించకుండా అలసత్వం ప్రదర్శిస్తే విధుల నుంచి తొలగించడం ఖాయమన్నారు. ఇలా నిర్లక్ష్యం వహిస్తున్న వారి జాబితాను తయారుచేయాల్సిందిగా సిడిఎంఏ ను మంత్రి అదేశించారు. చట్టం నిర్దేశించిన మేరకు అందరు మున్సిపల్ కమిషనర్లు ఉదయాన్నే విధుల్లో ఉండాలన్నారు. ఇకపై నిరంతరం విడియో కాన్ఫరెన్సు ద్వారా పర్యవేక్షణ చేస్తామని, ఇందుకోసం అన్ని మున్సిపాలీటీల్లో విడియో కాన్ఫరెన్సు సౌకర్యాన్ని వారంలోగా ఏర్పాటు చేయాలని అదేశాలిచ్చారు.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంజి గోపాల్, సిడిఎంఏ దాన కిశోర్, ఇతర ఉన్నతాధికారులున్నారు.