పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కొన్ని రాజకీయ పక్షాలు కోర్టు కేసులతో అడ్డుకుంటున్నాయని, ఈ కేసులు ఓ కొలిక్కి వస్తే…కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిగెత్తిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇవాళ ఆయన జల సౌధలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులోని 18 ప్యాకేజీలలో జరుగుతున్న పనులను ప్యాకేజీల వారీగా సమీక్ష జరిపారు. ప్యాకేజీ -1 లో 66 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనికి గాను 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తి చేసినట్లు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఇంజనీర్లు మంత్రికి వివరించారు. ఈ ప్యాకేజీలోని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్, టన్నెల నిర్మాణ పనులు, గ్రావిటీ కెనాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.ఈ ప్యాకేజీ పనులు పూర్తి చేస్తే మహబూబ్ నగర్ జిల్లా వాసులకు వచ్చే వేసవలిలో దాహార్తి తీర్చేందుకు తాగు నీటిని ఇవ్వవచ్చన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అటవీ భూముల సేకరణకు అవసరమైన 49 కోట్లును వెంటనె చెల్లించాలని ఆదేశించారు. రిజర్వాయర్ పనులు, టన్నెల్ పనులు, సర్జ్ పూల్, పంప్ హౌస్ పనుల వేగం మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్యాకేజీ-1 పనులనూ పూర్తి చేయడాన్ని ప్రాధాన్యతా అంశంగా పరిగణించి ఇంజనీర్లు పని చేయాలని సూచించారు. ప్యాకేజీ-2 లో అంజనాగిరి రిజర్వాయర్ పనులు చేపడుతున్నట్లు ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. ఈ రిజర్వాయర్ పరిధిలో మూడు రీచ్ లు ఏర్పాటు చేసిన పనులు నిర్వహిస్తున్నట్లు తెలపగా…రీచ్ ల వారీగా పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రీచ్ -1 లో పనులు వేగంగా జరుగుతున్నాయని, రీచ్ -2, రీచ్ – 3ల లో రిజర్వాయర్ బండ్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రీచ్ -2 లో మట్టి సమస్య నెలకొందని ఇంజనీర్లు తెలిపారు.
రాక్ ఫిల్ డ్యామ్ సాంకేతికను పరిశీలించండి….
రీచ్ -2 లో ఏర్పడిన మట్టి కొరత సమస్యను అధిగమించడానికి రాక్ ఫిల్ డామ్ విధానంలో పనులు నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఇదే విధానంలో తెహ్రీ డ్యామ్ నిర్మించారన్నారు.
రిజర్వాయర్ పనుల నాణ్యత లో రాజీ వద్దు…
ప్యాకేజీ 13, 14,15 కింద కర్వె న రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఇంజనీర్లు మంత్రి హరీశ్ రావుకు వివరించారు. ఈ ప్యాకేజీలో 4.5 కిలోమీటర్ల వరకు బండ్ పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. రిజర్వాయర్ల పనుల విషయంలో అత్యంత అప్రమత్తత పాటించాలని మంత్రి ఇంజనీర్లును ఆదేశించారు. పెద్ద రిజర్వాయర్లు కావడం వల్ల ఎలాంటి నాణ్యత లోపాలున్నా…. ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, ఎజెన్సీలు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పూర్తి అప్రమత్తతతో పని చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు. ప్యాకేజీ 16 కింద ఉద్దండాపూర్ పంప్ హౌస్, ప్యాకేజీ 17,18 కింద ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు చేపడుతున్నట్లు ఇంజనీర్లు మంత్రికి వివరించారు. ఇందులో 17 కిలోమీటర్ల టన్నెల్ కు గాను 4 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయిందని, ఇంకా 13 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాల్సి ఉందన్నారు. రైల్వే క్రాసింగ్ లైన్, నేషనల్ హైవే… ఉండటంతో పనులకు కొంత జాప్యం కలిగిందని వివరించారు. ముందుగా ఒక టన్నెల్ పై దృష్టి సారించి పూర్తి చేయాలని మంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. భద్రత విషయంలోను తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని రక్షణ ఏర్పాట్లతోనే పనులు జరిపేలా సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సమీక్షలో ఈ ఎన్ సీ మురళీధర్, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఈలు, ఎస్.ఈలు, ఆయా స్థాయిల ఇంజనీర్లు, గుత్తేదారులు హజరయ్యారు.