రాష్ట్రంలో పసుపు, మిర్చి పంటల సమగ్ర అభివృద్ధిపై రైతులు, శాస్త్రవేత్తలు, వాణిజ్యవేత్తలతో చర్చించి 15 రోజులలోగా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి సంబందిత శాఖాధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో స్పైస్ డెవలప్ మెంట్ ఏజన్సీ సమావేశం సి.యస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారధి, ఉద్యానవన శాఖ కమీషనర్ వెంకటరాం రెడ్డి, స్పైసెస్ బోర్డు డి.డి. జి.లింగప్ప, కేంద్ర ప్రభుత్వ అధికారి సత్యం శద్రా, రైతులు పొలం రమణారెడ్డి, జి.సుధాకర్, యం జితేందర్ లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారధి మాట్లాడుతూ తెలంగాణలో పసుపు, మిర్చితో పాటు అల్లం, వెల్లుల్లి తదితర 8 రకాల స్పైసెస్ లను పండిస్తున్నారని, నిజామాబాద్ జిల్లా పడగల్ లో 30 కోట్లతో స్పైస్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా రైతులకు మేలు జరుగుతుందని సి.యస్ కు వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పసుపు, మిర్చి పంటల సేద్యానికి ప్రోత్సాహం అందిస్తామన్నారు.