పల్లె కన్నీరు పెడుతున్నదో వంటి పాటలతో తెలంగాణ పల్లెల గోసను చాటి చెప్పిన ప్రజాకవి గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం
పల్లె కన్నీరు పెడుతున్నదో వంటి పాటలతో తెలంగాణ పల్లెల గోసను చాటి చెప్పిన ప్రజాకవి గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారాన్ని మంత్రి కడియం శ్రీహరి అందించి సత్కరించారు.
మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, కాళోజీ జయంతి సభను తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ నిర్వహించడం అభినందనీయం. కాళోజీ విశ్వ ప్రజాకవి నోబుల్ బహుమతికి అర్హత ఉన్నమహానుభావుడు. ఆ స్థాయి గుర్తింపు వచ్చేలా కృషి చేయాలి. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా కాళోజీ చిరస్మరణీయంగా నిలిచి ఉంటారు. వరంగల్ లో రూ.60 కోట్ల వ్యయంతో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించే ఈ కళాక్షేత్రానికి కేంద్ర ప్రభుత్వం కూడా రూ.15 కోట్లు మంజూరు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గోరటి వెంకన్న పాట మూడుకోట్ల ప్రజలను నడిపించిదని, అలాగే వెంకన్నకు గౌరవ డాక్టరేట్ ఇప్పించడానికి కూడా కృషి చేస్తానని మంత్రి కడియం ఈ సందర్భంగా అన్నారు.
సభలో పాల్గొన్న శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి తన ప్రసంగంలో కాళోజీ కవితారీతులను స్మరించుకున్నారు.
ఆర్థికమంతి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాళోజీతో కలిసి పాల్గొన్న రోజులు గుర్తు చేసుకున్నారు. అనేక ఉద్యమాలలో తామిద్దరం కలిసి పాల్గొన్నామని, ఆ రోజుల్లో తమను తాతా మనుమళ్లుగా సంబోధించేవారని అన్నారు.
మనిషిని వస్తువుగా చేసుకొని జీవితకాలమంతా కవిత్వం రాసిన కాళోజీ చిరస్మరణీయంగా ఉంటారని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. కాళోజీ అవార్డు అందుకుంటున్న గోరటి వెంకన్నను అభినందించారు.
అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడని అన్న కాళోజీ తెలంగాణలోని ప్రతి గుండెలో కొలువై ఉన్నాడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పేర్కొన్నారు.
సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ కన్నీటిభాష తెలిసిన గొప్పకవిగా కాళోజీని అభివర్ణించారు. కాళోజీ పురస్కారం ఆయన అంతేవాసిగా ప్రజలలో నిలిచిన గోరటికి దక్కడం విశేషమని అన్నారు
సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ గోరటితో తనకు ఉన్న అనుబంధాన్ని, గోరటి సాహిత్య విశేషాలను సభకు వివరించారు.
పురస్కార గ్రహీత గోరటి వెంకన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోని పలువురు పెద్దలకు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తనపైన ఎనలేని వాత్సల్యం ఉన్నదని, ఆ వాత్సల్యానికి ప్రతీకయే ఈ పురస్కారమని అన్నారు. ఈ సందర్భంగా గొంతు విప్పి తనదైన శైలిలో పాటలు పాడి సభను ఉర్రూతలూగించారు.
ఈ సమావేశంలో శాసనమండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎంఎల్సీ కర్నెప్రభాకర్, అధికార భాషాసంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎంఎల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు కూడా పాల్గొన్నారు.