- నెలాఖరుకల్లా నాలుగో విడత హరితహారం పూర్తి కావాలి *మొక్కలు నాటే లక్ష్యం కుదింపు కుదరదు, అన్ని జిల్లాలు పూర్తి చేయాల్సిందే*వచ్చే యేడాది కోసం కొత్త నర్సరీల ఏర్పాటు వెంటనే చేపట్టాలి*కొత్త అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో పనులు వెంటనే ప్రారంభించాలి*అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా వీడియో కాన్ఫరెన్స్.*
నాలుగో విడత హరితహారంలో భాగంగా జిల్లాల వారీగా ఇచ్చిన మొక్కలు నాటే లక్ష్యాల కుదింపు ఎంత మాత్రం కుదరదని, అన్ని జిల్లాలు ఈ నెలాఖరుకల్లా తమ తమ లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిందే అన్నారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా. హరితహారం పురోగతిపై సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈయేడాది హరితహారం సంతృప్తికరంగా కొనసాగుతోందని, మేడ్చల్, జగిత్యాల, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేశాయని, ఆ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, సిబ్బందిని అజయ్ మిశ్రా ప్రశంసించారు. మిగతా జిల్లాలు కూడా ఈ నెలాఖరుకల్లా మొక్కలు నాటడం కచ్చితంగా పూర్తి చేయాలన్నారు.
సెప్టెంబర్ 16 న నిర్వహించే వి.ఆర్.ఓ పరీక్షల నిర్వహణకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని TSPSC కార్యదర్శి వాణి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను కోరారు.
పాడి గేదల పంపిణీ పై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి గ్రౌండింగ్ ను వేగవంతం చేయాలని పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పాడిగేదల పంపిణీ, ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని సెప్టంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలు ముఖ్యమైన సీజన్ అని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గ్రామీణాభివృద్ది శాఖ కమీషనర్ నీతూ ప్రసాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, పీసీసీఎఫ్ పీ.కె.ఝా, సి.ఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎం.డోబ్రియల్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు