అమరావతి, జూన్ 13: ఢిల్లీలో ఈనెల 17వ తేదీ ఉదయం నిర్వహించనున్న నీతి ఆయోగ్ (NITI Ayog) 4 గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని 18 వ తేదీకి వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడిక్కడ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్కు లేఖ రాశారు. ఈనెల 16 వతేదీన రంజాన్ పండుగ ఉందని, ముస్లింలకు ఇది పెద్దపండుగ అని, 17వ తేదీ ఉదయం ఈద్ మిలాప్ ఉందని, అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను రాజధాని అమరావతిలో ఉండాల్సి ఉందని, ఈ కారణంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని 18వ తేదీకి లేదా కనీసం 17వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేయాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లేఖలో వివరించారు. తమ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి అన్నారు.
‘నీతి ఆయోగ్’లో ప్రస్తావనాంశాలపై అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి
ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. విభజన అంశాలు, కేంద్ర ప్రాజెక్టులకు అందిస్తున్న నిధులతో నివేదిక అందించాలని, అవసరమైన జిల్లాలకు ప్రత్యేక సహాయం అందుతున్న తీరుపై నీతి ఆయోగ్ చర్చనీయాంశాల్లో ఉందని, అందువల్ల సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. నీతి ఆయోగ్ గత సమావేశపు కార్యప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుకు కేంద్రం నుంచి ఏమేరకు సహకారం అందుతుందో తనకు సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.
వ్యవసాయరంగంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే అంశంలో, ఇ-నామ్, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు, భూసార స్థితి కార్డులు తదితర అంశాలపై ఆయన అధికారులతో మాట్లాడారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు ఏమేరకు వినియోగించాం, ఇంకా కేంద్రం నుంచి ఎంత రావాలి? అనే వివరాలను, అలాగే వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అమలు జరుగుతున్న కేంద్రపథకాల తాజా స్థితిని చంద్రబాబు సమీక్షించారు.
ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి రాష్ట్రీయ స్వస్థ సురక్షా మిషన్ , పోషణ్ మిషన్ (Poshn Mission), మిషన్ ఇంధ్రధనుష్ అమలు వివరాలను తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో జలసంరక్షణకు, నదుల అనుసంధానానికి నరేగా నిధులను ఏమేరకు వినియోగించాం? మెరుగైన ఫలితాల సాధనకు నరేగా నిధులను ఎలా ఉపయోగించాలో నివేదికలో వివరాలు పొందుపర్చాలని కోరారు. జాతిపిత మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాలకు రాష్ట్రంలో ఏం చేయవచ్చో సూచనలివ్వాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకటరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శులు ఎ.వి రాజమౌళి, గిరిజా శంకర్, సీసీఎల్ఏ అనిల్ చంద్ర పుణేఠా తదితరులు పాల్గొన్నారు.