నిన్న హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఇవాల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్వయంగా రంగంలోకి దిగారు. మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ంఎసీ అధికారులతో కలిసి నగరంలో పరిశీలించారు. నగరంలోని నాలాలు, నాలాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. కుంటలను ఆక్రమించన తీరును గమనించారు. ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు.
నిజాంపేట బండారి లేఅవుట్లో నీట మునిగిన అపార్ట్మెంట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్ వార్షిక సగటు వర్షాపాతం 32 సెం.మీ అని తెలిపారు. కానీ ఇవాళ ఒకే రోజు ఈ ప్రాంతంలో సుమారు 23 సెం.మీ వర్షం కురిసిందన్నారు. దీంతో నిజాంపేటతోపాటు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయని వివరించారు. ఇలాంటి ప్రకృతి వైఫరీత్యాలు ఏర్పడినపుడు ప్రభుత్వం చేసే సహాయ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు 48 గంటల నుంచి 72 గంటలపాటు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి అని అన్నారు.ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తే ప్రభుత్వానికి సహాయ చర్యలు చేపట్టడం సులభమవుతుందని విజ్ఞప్తి చేశారు. అవసరమైన చోట అన్ని సహాయ చర్యలు చేపడుతున్నామన్నారు. మున్సిపల్, విద్యుత్, పోలీసు, వాటర్ వర్క్స్ నాలుగు శాఖల అధికారులు సమన్వయంలో పనిచేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. ప్రజలు వారికి సహకరించాలని కోరారు.