
దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం
మెక్సికో సెప్టెంబర్ 8(ఎక్స్ ప్రెస్ న్యూస్): దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.0గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. మెక్సికో తీరంలోని ట్రెస్పికోకు 119 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభించింది. పిజిజియాపన్కు 123 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అత్యంత శక్తిమంతమైన ప్రకంపనలు రావడంతో మెక్సికో సిటీలోని భవనాలు బీటలు వారాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. దాదాపు 90 సెకండ్ల పాటు భవనాలు కంపించాయని స్థానికులు చెబుతున్నారు. భూకంపం కారణంగా ఎనిమిది దేశాలకు సునామీ హెచ్చరికలను జారీచేసినట్లు యూఎస్ వాతావరణ అధికారులు వెల్లడించారు. మెక్సికో, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్, కోస్టారికా, నిఖరాగ్వా, పనామా, హోండూరస్, ఈక్వెడార్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప ధాటికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. 1985 తర్వాత మెక్సికోలో ఇదే అత్యంత శక్తిమంతమైన భూకంపం అని అధికారులు చెబుతున్నారు.