తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఆవిష్కరణ అనంతరం జిల్లాలు మరియు కమిషనరేట్ల పాలన గురించి డీజీపీ అనురాగ్ శర్మ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల ఎస్పీలు ,కమిషనర్లు మరియు ఇతర పొలిస్ అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి కావాల్సిన కనీస సదుపాయలలో కార్యాలయ భవనంతో పాటుగా ఫర్నిచర్, పూర్తిస్థాయిలో సిబ్బంది, కంప్యూటర్లు, ఫ్యాక్స్, జిరాక్స్ మిషన్లు అన్నీ త్వరగా సమకూర్చుకోవాలని నూతన ఎస్పీలకు డి.జి.పి సూచించారు. ప్రభుత్వం నూతన వాహనాలను మంజూరు చేసిందని, అన్ని స్థాయిల అధికారులకు వాహనాలు ఇస్తామని డి.జి.పి తెలిపారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న కార్యాలయాల ఫోటోలు, సిబ్బంది గదులు, నూతన పోలీస్ స్టేషన్లు, సర్కిళ్ల కార్యాలయ ఫోటోలు, సిబ్బంది వివరాలతో నూతన జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డి.జి.పి కి వివరించారు.
జిల్లా భౌగోళిక స్వరూపం, అక్కడి రాజకీయ వాతావరణం, ప్రజల అవసరాలు, వారి సంప్రదాయం అన్నీ కూడా జిల్లా ఎస్పీలు బాగా స్టడీ చేయాలని డి.జి.పి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, ఈ లోపు తమ అవసరాలని, ప్రాధాన్యతలను ఉన్నతాధికారులకు తెలియచేస్తూ వుండాలన్నారు.
ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎస్పీలతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, రామగుండo, కరీంనగర్, వరంగల్ పోలీస్ కమిషనర్లు, అదనపు డి.జి.పి లు, ఐ.జీలు, డి.ఐ.జి.లు పాల్గొన్నారు.